రైతు ఇంట తేనీరు సేవించిన రాహుల్ గాంధీ !

Telugu Lo Computer
0


భారత్ జోడో యాత్ర రాజస్థాన్‌లో కొనసాగుతుంది. రాహుల్ గాంధీ సాధారణ ప్రజానీకంతో మమేకమవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. దీనిలో భాగంగానే ఆయన ఓ రైతు ఇంటి వద్ద తేనీరు సేవించేందుకు ఆగారు. ఈ అవకాశాన్ని ఆ రైతు సద్వినియోగం చేసుకున్నారు. విద్యుత్తు బిల్లు, ఎరువులు వంటి సమస్యలను ఏకరువు పెట్టారు. తమిళనాడులోని కన్యా కుమారి నుంచి ప్రారంభమైన భారత్ జోడో యాత్ర ఈ నెల 5 నుంచి రాజస్థాన్‌లో జరుగుతోంది. సోమవారం ఉదయం 8.30 గంటలకు ఖిజురి గ్రామంలోని రైతు వేణి ప్రసాద్ మీనా ఇంటి వద్ద తేనీరు సేవించేందుకు ఆయన ఆగారు. రాహుల్‌తో మీనా మాట్లాడుతూ, తాను అత్యధిక విద్యుత్తు బిల్లు చెల్లించవలసి వస్తోందని చెప్పారు. విద్యుత్తు ఛార్జీల్లో తమ గ్రామస్థులకు ఎటువంటి రాయితీలు ఇవ్వడం లేదన్నారు. తాము ఎన్ని యూనిట్ల విద్యుత్తును వినియోగించామో నిర్థరించేందుకు ఎలక్ట్రీషియన్లు తమ ఇళ్ళ వద్దకు రావడం లేదని చెప్పారు. విద్యుత్తు శాఖ అధికారులు తమకు నచ్చినట్లుగా బిల్లులను పంపిస్తున్నారని ఆరోపించారు. గ్రామస్థులంతా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. తమకు ఎంతో అవసరమైన ఎరువులు కూడా తమకు లభించడం లేదన్నారు. ఎరువులను మితిమీరిన ధరకు కొనవలసి వస్తోందని తెలిపారు. రూ.270 విలువ చేసే ఎరువుల బస్తాను నల్ల బజారులో రూ.600కు అమ్ముతున్నారని చెప్పారు. మీనాకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరితో కూడా రాహుల్ గాంధీ మాట్లాడారు. చదువులపై దృష్టి పెట్టాలని వారికి సలహా ఇచ్చారు. వారికి చాకొలెట్లు ఇచ్చారు. రాహుల్ గాంధీ మళ్లీ యాత్రకు బయల్దేరుతుండగా భరత్‌లాల్ మీనా, గోపాల్ గుర్జర్ ఆయనను గట్టిగా పిలిచారు. దీంతో వారితో కూడా ఆయన మాట్లాడారు. వారిద్దరూ హర్షం వ్యక్తం చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)