మా రాష్ట్రంలో కమీషన్లు ఇవ్వనిదే ఏదీ జరగదు !

Telugu Lo Computer
0


ఉత్తరాఖండ్‌లో కమీషన్లు ఇవ్వనిదే ఏ పని జరగదంటూ మాజీ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ మాట్లాడిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. పార్టీ సీనియర్‌ నేత, మాజీ సీఎం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర భాజపా సర్కారును ఇరుకునపడేసింది. ఆ వీడియోలో తీరత్‌ సింగ్ ఓ గదిలో కూర్చుని రాష్ట్రంలోని 'కమీషన్‌ఖోరి' గురించి మాట్లాడారు. ''నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను. బహుశా ఇలాంటివి చెప్పకూడదేమో. కానీ ఉత్తరాఖండ్‌లో కమీషన్లు ఉన్నాయని నేను నిస్సందేహంగా అంగీకరిస్తాను. మా రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ నుంచి విడిపోయే సమయంలో ప్రజా పనులు జరగాలంటే 20 శాతం వరకు కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇవి తగ్గాల్సింది. కానీ, ఆ ప్రాక్టీస్‌ కొనసాగడమే గాక, కమీషన్లు 20 శాతం నుంచి ప్రారంభమయ్యాయి. కొంత మొత్తాన్ని కమీషన్‌గా ఇస్తేనేగానీ ఉత్తరాఖండ్‌లో ఎవరికీ ఏ పనీ జరగదు. దీనికి ఫలానా వారే బాధ్యులని నేను చెప్పలేను. కానీ ఇదో అలవాటుగా మారింది. మన రాష్ట్రాన్ని మన కుటుంబంలా చూసినప్పుడే ఇది పోతుంది'' అని తీరత్‌ వ్యాఖ్యానించారు. ఈ వీడియో ఎప్పటిది అని స్పష్టంగా తెలియనప్పటికీ.. ప్రస్తుతం ఇది సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)