అల్జీమర్స్ వ్యాధి - బీర్‌

Telugu Lo Computer
0


ప్రపంచంలో చాలా మంది వృద్ధులు అల్జీమర్స్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి తీవ్ర మతిమరుపునకు కారణమవుతుంది. నిపుణులు సైతం ఈ వ్యాధికి సరైన చికిత్స అందించలేకపోతున్నారు. అందుకు కారణంగా వ్యాధి లక్షణాలను గుర్తించేసరికే బాధితుల నాడీ వ్యవస్థ కోలుకోలేని స్థాయిలో దెబ్బతింటోంది. అందుకే వ్యాధిని ముందస్తుగా గుర్తించే, నివారించే ప్రక్రియలను అభివృద్ధి చేయడానికి పరిశోధనలు జరుగుతున్నాయి. అల్జీమర్స్‌ను ప్రారంభ దశల్లో గుర్తించే పాజిట్రాన్‌ ఎమిషన్‌ టోమోగ్రఫీ ఇమేజింగ్‌ టెక్నిక్‌ను అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. అయితే బీర్‌ తయారీలో ఉపయోగించే హాప్‌ పూల ద్వారా అల్జీమర్స్‌ రాకుండా నివారించే అవకాశం ఉందని మరో అధ్యయనం చెబుతోంది. హాప్ పువ్వుల నుంచి సేకరించిన రసాయనాలు, అల్జీమర్స్ వ్యాధి తో సంబంధం ఉన్న అమిలాయిడ్ బీటా ప్రోటీన్‌ల సమూహాన్ని నిరోధించగలవు. పాన్-యూరోపియన్ శాస్త్రవేత్తల బృందం చేసిన పరిశోధన ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. పరిశోధన వివరాలు బ్రిటీష్ జర్నల్ ఆఫ్ ఆప్తాల్మాలజీలో ప్రచురితమయ్యాయి. హాప్ వాడే డ్రింక్స్‌తో ఆరోగ్య ప్రయోజనాలు ఉండవచ్చని, అల్జీమర్స్‌పై ప్రభావం చూపే లక్షణాలు ఇందులో ఉన్నాయని పేర్కొన్నారు. అల్జీమర్స్‌ లక్షణాలను ముందే గుర్తించడంలో ఇబ్బందుల కారణంగా, దీనికి చికిత్స కష్టతరమవుతోంది. ఈ లక్షణాలను చాలా సంవత్సరాల పాటు గుర్తించే అవకాశం ఉండదు. గుర్తించే సమయానికి నాడీ వ్యవస్థ పూర్తిగా కోలుకోలేని స్థితిలో దెబ్బతిని ఉంటుంది. దీంతో లక్షణాలు కనిపించకముందే జోక్యం చేసుకోగల చికిత్సా విధానాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ వ్యూహాలలో ఒకటి న్యూట్రాస్యూటికల్స్. ఇవి కొన్ని రకాల ఔషధ లేదా పోషకాల పనితీరును చూపే ఆహార పదార్థాలు. బీర్‌ తయారీలో సువాసన కోసం వినియోగించే హాప్ పువ్వులు న్యూట్రాస్యూటికల్స్‌లో ఒకటిగా గుర్తించారు పరిశోధకులు. హాప్స్‌లోని ఏ రసాయన సమ్మేళనాలు ఈ ప్రభావాన్ని కలిగిస్తున్నాయో తెలుసుకోవాలని రిసెర్చర్లు అధ్యయనం ప్రారంభించారు. ఈ సమ్మేళనాలను గుర్తించడానికి, బ్రూయింగ్ ప్రక్రియకు సమానమైన పద్ధతిని ఉపయోగించి నాలుగు సాధారణ రకాల హాప్‌లను ఎక్స్‌ట్రాక్ట్‌ చేసి వర్గీకరించారు. పరీక్షలలో ఈ ఎక్స్‌ట్రాక్ట్స్‌ యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నాయని, మానవుల నరాల కణాలలో అమిలాయిడ్ బీటా ప్రోటీన్లు అతుక్కోకుండా నిరోధించగలవని కనుగొన్నారు. అత్యంత విజయవంతమైన ఎక్స్‌ట్రాక్ట్‌ టెట్నాంగ్ హాప్ నుంచి వచ్చింది. ఇది అనేక రకాల లాగర్లు, లైటర్ ఆలెస్‌లలో కనిపించింది. ఇది శరీరాన్ని మిస్‌ఫోల్డెడ్‌, న్యూరోటాక్సిక్ ప్రోటీన్‌లను క్లియర్ చేయడానికి ఉపయోగపడే ప్రక్రియలను కూడా ప్రోత్సహించింది. దీంతో అల్జీమర్స్‌ను అభివృద్ధిని ఎదుర్కొనే న్యూట్రాస్యూటికల్స్‌ను హాప్ సమ్మేళనాలు బలోపేతం చేస్తాయని పరిశోధకులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)