దేశ ప్రజల వద్ద 30 లక్షల 88 వేల కోట్ల నగదు !

Telugu Lo Computer
0


దేశంలోని ప్రజల వద్ద ఎంత డబ్బు ఉందో ఆర్బీఐ గణాంకాలు తాజాగా వెల్లడించాయి. 2022 అక్టోబర్ 21 నాటికి నగదు చలామణి గణనీయంగా పెరిగి 30 లక్షల 88 వేల కోట్లకు పెరిగింది. సాధారణ, వ్యాపార లావాదేవీలు, వస్తువులు - సేవల కొనుగోలు కోసం వినియోగించే నగదును ప్రజల వద్ద ఉన్న డబ్బుగా లెక్కగడతారు. వ్యవస్థలో మొత్తం చలామణీలో ఉన్న నగదు నుంచి బ్యాంకుల వద్ద ఉన్న డబ్బును తీసేస్తే ఇది వస్తుంది. కొత్త కొత్త డిజిటల్ పేమెంట్ సాధనాలు వస్తున్నప్పటికీ నగదు చలామణీ పెరుగుతుండడం గమనార్హం. నల్లధనం అరికట్టడం, దొంగనోట్ల చలామణీని రూపుమాపడం కోసం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రజల వద్ద ఉన్న నగదు విలువ రూ. 17.70 లక్షల కోట్లుగా ఉంది. అది గత నెలకల్లా 71.84 శాతం పెరగడం గమనార్హం. ఇక దీపావళి సందర్భంగా నగదు చలామణి రూ. 7,600 కోట్లు తగ్గినట్టు ఎస్బీఐ నివేదిక వెల్లడించింది. రెండు దశాబ్దాలతో పోలిస్తే ఇంతమేర తగ్గడం ఇదే మొదటిసారని తెలిపింది. డిజిటల్ చెల్లింపులు పెరగడమే ఇందుకు కారణమని విశ్లేషించింది. అయినా నగదు చెలామణి పెరగడం ఆందోళన కలిగిస్తోందని ఆర్ధికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం భారత ఆర్ధిక వ్యవస్థ నిర్మాణాత్మక మార్పులకు లోనవుతుందని వారు చెప్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)