పాక్‌కు చెమటలు పట్టించిన బంగ్లా !

Telugu Lo Computer
0


క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా న్యూజిలాండ్‌తో టీ20 ట్రై సిరీస్‌లో భాగంగా పాకిస్తాన్‌- బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ ఆఖరి బంతి వరకు రసవత్తరంగా సాగింది. పోరులో చివరికి పాకిస్తాన్‌ పైచేయి సాధించింది. మరో బంతి మిగిలి ఉండగానే మహ్మద్‌ నవాజ్‌ ఫోర్‌ బాది పాక్‌ను విజయతీరాలకు చేర్చాడు. ఈ ఓటమితో ఒక్క మ్యాచ్‌ కూడా గెలవకుండానే ట్రై సిరీస్‌ నుంచి బంగ్లాదేశ్‌ నిష్క్రమించింది. టీ20 వరల్డ్‌కప్‌-2022 సన్నాహకాల్లో భాగంగా జరిగిన సిరీస్‌లో చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఇదిలా ఉంటే.. శుక్రవారం నాటి ట్రై సిరీస్‌ ఫైనల్లో పాకిస్తాన్‌- న్యూజిలాండ్‌ తలపడనున్నాయి.మరోసారి విజృంభించిన కెప్టెన్‌.. కానీ పాక్‌తో గురువారం నాటి మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది బంగ్లాదేశ్‌. ఓపెనర్లు షాంటో(12), సౌమ్య సర్కార్‌(4) విఫలం కాగా.. వన్‌డౌన్లో వచ్చిన లిటన్‌ దాస్‌, ఆ తర్వాతి స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్‌ షకీబ్‌ అల్‌ హసన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. లిటన్‌ దాస్‌ 42 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 69 పరుగులు చేయగా.. షకీబ్‌ 42 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 68 పరుగులు సాధించి మరోసారి కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. మిగతా ఆటగాళ్లకు నామమాత్రపు స్కోరుకే పరిమితం కాగా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్‌ 173 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్‌ ఓపెనింగ్‌ జోడీ మహ్మద్‌ రిజ్వాన్‌(56 బంతుల్లో 69 పరుగులు), బాబర్‌ ఆజం(40 బంతుల్లో 55 పరుగులు) అర్ధ శతకాలతో కదం తొక్కింది. హైదర్‌ అలీ విఫలం(0) కాగా.. మహ్మద్‌ నవాజ్‌ 45 పరుగులతో అజేయంగా నిలిచి పాక్‌ను విజేతగా నిలిపాడు. 19.5 ఓవర్లలో పాకిస్తాన్‌ 3 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ ఛేదించింది. ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)