ప్రవాస గుజరాతీలకు అమిత్‌షా పిలుపు

Telugu Lo Computer
0


భారతీయ జనతా పార్టీ గుజరాత్‌ ఎన్నికల్లో విజయపరంపరను కొనసాగిస్తూ వస్తుండటం వెనుక ప్రవాస గుజరాతీల పాత్ర ఎంతో కీలకమని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా అన్నారు. బీజేపీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశాన్ని రాష్ట్రంలోని గ్రామగ్రామాలకు చేరవేయాలని ప్రవాస గుజరాతీలను ఆయన కోరారు. మూడురోజుల 'ప్రవాసి గుజరాతి పర్వ్ 2022' ప్రారంభోత్సవానికి హాజరైన వారిని ఉద్దేశించిన అమిత్‌షా శనివారంనాడు వర్చువల్ పద్ధతిలో ప్రసంగించారు. గుజరాతీలు ఎక్కడ ఉన్నా ఆ దేశానికి పేరు ప్రతిష్ఠలు తెస్తుంటారని, కేవలం దేశాభివృద్ధికే కాకుండా ప్రపంచాభివృద్ధిలో గణనీయ పాత్రను పోషిస్తున్నారని అమిత్‌షా కొనియాడారు. ''1990 నుంచి ఎప్పుడు ఎన్నికలు జరిగినా గుజరాతీ ప్రజలు బీజేపీని గెలిపిస్తూ వస్తున్నారు. ఈ విజయాల్లో ఎన్‌ఆర్‌జీలు కీలకంగా వ్యవహరిస్తున్నారు. మీరు మీ గ్రామాలకు ఇచ్చే సందేశం చాలా కీలకమనే విషయం నాకు తెలుసు'' అని అమిత్‌షా ఆ వీడియో సందేశంలో అన్నారు. నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, అభివృద్ధిని కొత్తపుంతలు తొక్కించారని, ఆనువంశిక పాలన, కులతత్వం, బుజ్జగింపు రాజకీయాలకు చరమగీతం పాడి ఎలక్టోరల్ పాలిటిక్స్‌పై ప్రజలకు నమ్మకాన్ని పెంచారని అన్నారు. సంక్షోభ సమయాన్ని కూడా ఒక అవకాశంగా ఎలా మలుచుకోవాలో, శాంతి భద్రతలను మెరుగుపరిచి కర్ఫూ రహిత పరిస్థితిని ఎలా తీసుకురావాలో, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో ఎలా పెకిలించాలో మోదీ చేసి చూపించారని, దేశ సంస్కృతీ వారసత్వాన్ని గర్వంగా ప్రపంచదేశాలకు చాటారని అమిత్‌షా అన్నారు. గుజరాత్ అభివృద్ధికి కట్టుబడి బీజేపీ ప్రభుత్వం పనిచేస్తోందని, గుజరాత్‌కు విశ్వవ్యాప్త గుర్తింపును మోదీ తీసుకువచ్చారని చెప్పారు. ఈ ప్రయాణాన్ని మనమంతా కలిసి ముందుకు తీసుకువెళ్లాలని ఎన్ఆర్‌జీలను కోరారు. దేశాభివృద్ధికి కోసం పార్టీ, ప్రధానమంత్రి చేస్తున్న కృషిని గ్రామగ్రామానికి తీసుకువెళ్లే బీజేపీ అంబాసిడర్లు కావాలని ప్రవాస గుజరాతీయలకు ఆయన పిలుపునిచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)