కేరళ యూనివర్సిటీల వీసీలకు హైకోర్టులో ఊరట !

Telugu Lo Computer
0


రాజీనామా చేయాలంటూ గవర్నర్ నుంచి షోకాజ్ నోటీసులు ఎదుర్కొన్న తొమ్మిది యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్స్‭లర్లకు కేరళ హైకోర్టు ఊరట కల్పించింది. కేరళ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నుంచి తుది ఆదేశాలు జారీ చేసే వరకు పదవుల్లో కొనసాగవచ్చని ధర్మాసనం పేర్కొంది. ఈ విషయమై దీపావళి పండుగ అయినప్పటికీ న్యాయస్థానం ప్రత్యేకంగా విచారణ చేపట్టింది. అక్టోబరు 24వ తేదీ ఉదయం 11:30 గంటలలోపు 9 యూనివర్సిటీలకు చెందిన వైస్ చాన్స్‭లర్లు రాజీనామా సమర్పించాలని కేరళ గవర్నర్ ఆదివారం షోకాజ్ నోటీసులు పంపించారు. ఈ లేఖ సంబంధిత వర్సిటీల వీసీలు, రిజిస్ట్రార్‌లకు ఈమెయిల్‌ కూడా పంపినట్లు గవర్నర్ కార్యాలయం పేర్కొంది. దీంతో వారంతా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. అనంతరం మళ్లీ సాయంత్రం 3:00 లోపు రాజీనామా చేయాలంటూ రాజ్ భవన్ నుంచి మరొకసారి షోకాజ్ నోటీసులు వచ్చాయి. ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రభుత్వం తొమ్మిది విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లును నియమించింది. అయితే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా ఈ నియామకాలు జరిగాయని, రాష్ట్ర ప్రభుత్వానికి వీసీలను నియమించే అధికారం లేదని గవర్నర్ పేర్కొన్నారు. ఈ విషయమై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఆయన ప్రస్తావించారు. అయితే కేంద్ర ప్రభుత్వం మన్ననలు పొందడానికే రాష్ట్ర గవర్నర్ ఇలా చేస్తున్నరని, ఆయన పూర్తిగా సంఘ్ పరివార్‌ నాయకుడిగా మారిపోయారని ముఖ్యమంత్రి పినరయి మండిపడ్డారు. గవర్నర్ షోకాజ్ నోటీసులు పంపిన ఈ జాబితాలో యూనివర్సిటీ ఆఫ్ కేరళ, మహాత్మ గాంధీ యూనివర్సిటీ, కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిఝరీస్ అండ్ ఓసియన్ స్టడీస్, కన్నూర్ యూనివర్సిటీ, ఏపీజే అబ్దుల్ కలాం టెక్నాలజికల్ యూనివర్సిటీ, శ్రీ శంకరాచార్య యూనివర్సిటీ ఆఫ్ సంస్క్రిట్, యూనివర్సిటీ ఆఫ్ కాలికట్, థంచాత్ ఎజుతాచన్ మలయాళం యూనివర్సిటీలు ఉన్నాయి. డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాం టెక్నికల్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌గా డాక్టర్ రాజశ్రీ ఎంఎస్ నియామకాన్ని సుప్రీంకోర్టు గతంలో రద్దు చేసింది. యూనివర్శిటీ గ్రాంట్స్ కమీషన్ ప్రకారం, సెర్చ్ కమిటీ వీసీ పదవికి ముగ్గురికి తక్కువ కాకుండా అర్హత గల వ్యక్తులతో కూడిన ప్యానెల్‌ను సిఫారసు చేయాల్సి ఉండగా, రాజశ్రీ విషయంలో ఆమె పేరు మాత్రమే సిఫార్సు చేయబడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)