ఇంటర్‌పోల్ సమావేశంలో ప్రారంభిచిన ప్రధాని

Telugu Lo Computer
0


న్యూఢిల్లీలోని ప్రగతి మైదానంలో ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ 90వ సమావేశాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. 195 దేశాలకు దీనిలో సభ్యత్వం ఉంది. వివిధ దేశాల మంత్రులు, ఆయా దేశాల పోలీస్ చీఫ్‌లు, నేషనల్ సెంట్రల్ బ్యూరోల అధిపతులు, సీనియర్ పోలీసు అధికారులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాలను ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, అన్ని వైపుల నుంచి ఉత్తమ ఆలోచనలను రానివ్వాలని వేదాలు చెప్తున్నాయన్నారు. అంతర్జాతీయ సహకారాన్ని భారత దేశం విశ్వసిస్తుందని చెప్పారు. ఇంటర్‌పోల్ ఓ చారిత్రక మైలురాయికి చేరువవుతోందన్నారు. 2023లో 100వ వార్షికోత్సవాన్ని జరుపుకోబోతోందని తెలిపారు. ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా తీర్చిదిద్దడానికి సార్వజనీన సహకారం కోసం ఇది పిలుపునిస్తోందని చెప్పారు. ఐక్య రాజ్య సమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలకు గొప్ప సహకారం అందిస్తున్న దేశాల్లో భారత దేశం ఒకటి అని అన్నారు. దేశాలు, సమాజాలు ఆత్మావలోకనం చేసుకుంటున్నాయని, మరింత ఎక్కువగా ప్రపంచం సహకరించుకోవాలని భారత దేశం పిలుపునిస్తోందని చెప్పారు. ముప్పు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నపుడు, స్పందన స్థానిక స్థాయిలో ఉండకూడదని చెప్పారు. ఈ ముప్పులన్నిటినీ ఓడించడానికి ప్రపంచమంతా కలిసి రావలసిన సమయం ఆసన్నమైందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదాన్ని ఓడించడానికి అంతర్జాతీయ వ్యూహాలను రూపొందించవలసిన అవసరం ఉందన్నారు. నేరగాళ్లు ఇతర దేశాలకు పలాయనమైనపుడు, వారిపై రెడ్ నోటీసులను జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. వ్యవస్థీకృత నేరాలు, అవినీతి ద్వారా వచ్చే నేర ప్రతి ఫలాలను నియంత్రించడానికి ఈ చర్యలు దోహదపడతాయని తెలిపారు. నేడు ప్రారంభమైన ఈ సమావేశాలు శుక్రవారం వరకు కొనసాగుతాయి. 25 ఏళ్ళ తర్వాత ఈ సమావేశాలు మన దేశంలో జరుగుతున్నాయి. మన దేశంలో శాంతిభద్రతల వ్యవస్థలో అత్యుత్తమ విధానాలను ప్రపంచానికి తెలియజేయడానికి అవకాశం కలిగిందని ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సందర్భంగా స్మారక తపాలా స్టాంపును, రూ.100 నాణేన్ని మోదీ విడుదల చేశారు. ఇంటర్‌పోల్‌కు అత్యున్నత స్థాయి పాలక మండలి జనరల్ అసెంబ్లీ. ఈ సమావేశాలు ఏడాదికోసారి జరుగుతాయి. దీని కార్యకలాపాలకు సంబంధించిన కీలక నిర్ణయాలను ఈ సమావేశాల్లో తీసుకుంటారు.

Post a Comment

0Comments

Post a Comment (0)