టీ20ల్లో టీమిండియా హవా !

Telugu Lo Computer
0


ఈ ఏడాది టీ20ల్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. 2022లో జరిగిన అన్ని ద్వైపాక్షిక టీ20 సిరీస్‌ల్లో భారత్ విజయాలు సాధించింది. అటు స్వదేశంలో, ఇటు విదేశాల్లో జరిగిన అన్ని టీ20 సిరీస్‌లను ఓటమి అనేది లేకుండా ముగించింది. వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, ఇంగ్లండ్, వెస్టిండీస్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో టీ20 సిరీస్‌లు సొంతం చేసుకుని ఐసీసీ ర్యాంకుల్లో నంబర్ వన్ జట్టుగా కొనసాగుతోంది. ద్వైపాక్షిక సిరీస్‌లలో ఓటమి అనేది లేకుండా సాగుతున్న టీమిండియా ఆసియా కప్‌లో మాత్రం నిరాశపరిచింది. సూపర్-6లో వరుసగా పాకిస్థాన్, శ్రీలంకపై ఓడిపోయి ఫైనల్ రేసు నుంచి తప్పుకుంది. నిలకడ లేని జట్టుతో రానున్న టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఏం చేస్తుందో అన్న సందేహాలు మాత్రం అభిమానుల్లో తలెత్తుతున్నాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్‌తో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 3-0తో భారత్ క్లీన్‌స్వీప్ చేసింది. అనంతరం ఫిబ్రవరి నెలాఖరులో శ్రీలంకతో సొంతగడ్డపై జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను కూడా వైట్ వాష్ చేసింది. స్వదేశంలో ఆగస్టులో దక్షిణాఫ్రికాతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 2-2తో డ్రాగా ముగించింది. జూన్ నెలలో ఐర్లాండ్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. అనంతరం ఇంగ్లండ్‌లో జూన్‌లో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో గెలుచుకుంది. జూలై-ఆగస్టు నెలల్లో వెస్టిండీస్‌ గడ్డపై జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 4-1 తేడాతో సొంతం చేసుకుంది. సెప్టెంబర్ నెలాఖరులో స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకోగా.. అక్టోబరులో దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన మూడు టీ20ల సిరీస్‌ను 2-1తేడాతో గెలుచుకుంది. ఈ మేరకు బీసీసీఐ ఓ ట్వీట్ చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)