కర్ణాటకలో కాంగ్రెస్ 150 సీట్లు గెలుస్తుంది !

Telugu Lo Computer
0


రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీతో పొత్తు లేకుండానే 150 సీట్లు గెలుస్తుందని  ఆ పార్టీ కర్ణాటక అధ్యక్షుడు డీకే శివకుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కర్ణాటకలో రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' చేపట్టిన సంగతి తెలిసిందే. విజయవంతంగా పూర్తైన ఈ యాత్రకు రాష్ట్రవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై శివ కుమార్ మీడియాతో మాట్లాడారు. ''ఎవరి మద్దతూ లేకుండానే కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 150 సీట్లు గెలుస్తుంది. రాష్ట్ర ప్రజలు 150 సీట్లు గెలిపించేందుకు సిద్ధమయ్యారు'' అని శివ కుమార్ అన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉండగా, కాంగ్రెస్ ప్రతిపక్షంగా కొనసాగుతోంది. కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లు ఉన్నాయి. ఇక, ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికార బీజేపీపై, సీఎం బసవరాజు బొమ్మైపై వినూత్న రీతిలో విరుచుకుపడుతోంది. కొద్ది రోజుల క్రితం సీఎం బొమ్మైకు వ్యతిరేకంగా 'పేసీఎమ్' పేరుతో పోస్టర్లు రిలీజ్ చేశారు. పేటీఎమ్ క్యూఆర్ కోడ్‌ను పోలిన పోస్టర్ మధ్యలో సీఎం బొమ్మై ముఖం ఉండేలా పోస్టర్ తయారు చేశారు. ఇది అప్పట్లో సంచలనంగా మారింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. మాజీ సీఎం సిద్ధ రామయ్య వర్గంతోపాటు, డీకే శివ కుమార్ వర్గాల మధ్య పోరు నడుస్తోంది. కాగా, కర్ణాటకలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)