కేరళ వరదల్లో ఆరుగురి మృతి

Telugu Lo Computer
0


కేరళలో కురుస్తున్న భారీవర్షాలు, వరదలతో భారత వాతావరణశాఖ ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. తిరువనంతపురం, కొల్లం, పతనమిట్ట, అల్లపుజా, కొట్టాయం, ఎర్నాకుళం, ఇడుక్కి జిల్లాల్లో మంగళవారం అతిభారీవర్షాలు కురిసే అవకాశమున్నందున ఐఎండీ రెడ్ అలర్ట్ ప్రకటించింది. భారీవర్షాలతో వెల్లువెత్తిన వరదల వల్ల ఆరుగురు మరణించగా, పలు ఇళ్లు వరదనీటికి కొట్టుకుపోయాయి. భారీవర్షాలు, వరదల కారణంగా సహాయ చర్యలు చేపట్టేందుకు అధికారులు సంసిద్ధంగా ఉండాలని కేరళ సీఎం పినరయి విజయన్ ఆదేశించారు. అన్ని జిల్లాలు, తాలూకా కేంద్రాల్లో కంట్రోలు రూంలు ఏర్పాటు చేసి స్టేట్ ఎమర్జెన్సీ ఆపరేషన్స్ బృందాలను సిద్ధంగా ఉంచారు. వరదపీడిత ప్రాంతాలైన ఇడుక్కీ, కోజికోడ్, వయానద్, త్రిస్సూర్ జిల్లాల్లో నాలుగు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. అతి భారీవర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరదనీటిని కేరళలోని 17 డ్యామ్ ల ద్వారా కిందకు విడుదల చేయాలని నిర్ణయించారు. ఇడుక్కీ, పొన్ ముడి, కుందాల, కల్లర్ కుట్టీ, ఎరాట్టయార్, లోయర్ పెరియార్ డ్యామ్ ల వద్ద నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకోవడంతో రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీవర్షాల వల్ల పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)