లాయర్ దారుణ హత్య !

Telugu Lo Computer
0


తెలంగాణలోని హనుమకొండకు చెందిన లాయర్ మూలగుండ్ల మల్లారెడ్డి  సోమవారం ములుగు  జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. భూ సమస్యలపై అధికారులతో సంప్రదించి అదే రోజు సాయంత్రం 6.30కు హనుమకొండకు తిరుగుపయనమయ్యారు. ఇదే సమయంలో గుర్తు తెలియని దుండగులు ఆయనను అడ్డగించి దారుణంగా హత్య చేశారు. ములుగు మండలంలోని పందికుంట బస్‌ స్టేజీ సమీపంలో మల్లారెడ్డి ప్రయాణిస్తున్న వాహనాన్ని వెనుక నుంచి వస్తున్న మరో కారు ఢీ కొట్టింది. మల్లారెడ్డి కారు దిగి  ఎందుకు ఢీ కొట్టారని వారిని ప్రశ్నించారు. వారు సంజాయిషీ ఇచ్చి, క్షమించాలని కోరడంతో మల్లారెడ్డి తన కారు ఎక్కాడు. అదే సమయంలో మరో నలుగురు వచ్చి  మల్లారెడ్డిని వారిలో నుంచి కిందికి లాగారు. సమీపంలోని పొదల్లోకి లాక్కెళ్లి కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చారు. మల్లారెడ్డి కారు డ్రైవర్ ను బెదిరించే కదలకుండా ఇద్దరు వ్యక్తులు పట్టుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితులందరూ అదే కారులో ఉడాయించారు. సమాచారం తెలుసుకున్న ములుగు ఎస్పీ సంగ్రామ్‌సింగ్‌ జి పాటిల్‌.. పోలీసు అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మర్డర్ ఇన్సిడెంట్ పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. హత్యకు గల కారణాలను ఆరా తీస్తున్నారు. హత్యపై వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను నియమించినట్లు ములుగు ఎస్సై ఓంకార్‌ యాదవ్‌ వెల్లడించారు. లాయర్ మల్లారెడ్డికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ గ్రామానికి చెందిన ఆయన హనుమకొండలో స్థిరపడ్డారు. భూసమస్యల విషయమై మల్లారెడ్డి ములుగు కలెక్టర్‌, తహసీల్దారు ఆఫీస్ లకు వెళ్తున్నారు. ఆయనకు ములుగు మండలం మల్లంపల్లిలో వ్యవసాయ భూములు ఉన్నాయి. అంతే కాకుండా ఎర్రమట్టి క్వారీ, పెట్రోలు బంకు ఉన్నాయి. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఆయనను హత్య చేసినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)