దేశంలో స్థలాల ధరలు భారీగా పెరిగాయి !

Telugu Lo Computer
0


దేశంలో ఇళ్లు/వాణిజ్య భవనాల నిర్మాణానికి అనువైన స్థలాల ధరలు శరవేగంగా పెరుగుతున్నాయి. ఏడు ప్రధాన నగరాల్లో గత రెండున్నరేళ్లలో ప్లాట్‌ల ధరలు సగటున 38 శాతం పెరిగినట్లు స్థిరాస్తి కన్సల్టెంట్‌ సంస్థ అనరాక్‌ నివేదిక వెల్లడించింది. దిల్లీ- ఎన్‌సీఆర్‌లోని యమునా ఎక్స్‌ప్రెస్‌వే వద్ద అత్యధిక పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. కరోనా సంక్షోభం తర్వాత ప్లాట్‌లకు గిరాకీ పెరిగిందని, ప్రజలు వీటిని పెట్టుబడి సాధనాలుగా చూస్తుండటమే ఇందుకు కారణమని తెలిపింది. 2020 నుంచి ప్లాట్‌ల అభివృద్ధి బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌, పుణె, ముంబయి మెట్రోపాలిటన్‌ ప్రాంతం, దిల్లీ-ఎన్‌సీఆర్‌లలో బాగా జరిగింది. హైదరాబాద్‌లో ఘట్‌కేసర్‌, ఆదిభట్ల, మేడ్చల్‌లలో ప్లాట్‌ సగటు ధరలు వరుసగా 26 శాతం, 24 శాతం, 21 శాతం వృద్ధి చెందాయి. యమునా ఎక్స్‌ప్రెస్‌వే దగ్గర సగటు ప్లాట్‌ ధరలు 2019 చివర్లో చదరపు అడుగు రూ.1600 కాగా.. ప్రస్తుతం 38 శాతం పెరిగి రూ.2200కు చేరింది. గ్రేటర్‌ నోయిడా (పశ్చిమ)లో చ.అ ధర రూ.3300 నుంచి 36 శాతం వృద్ధితో రూ.4500కు పెరిగింది. ఫరీదాబాద్‌లోని నేహార్‌పూర్‌ వద్ద ధరలు రూ.3500 నుంచి రూ.4500కు చేరాయి. 'కొవిడ్‌ తర్వాత స్థిరాస్తి పెట్టుబడిదార్ల చూపు ప్లాట్‌లపై పడింది. అపార్ట్‌మెంట్‌లతో పోలిస్తే భూములు అధిక రాబడులు ఇస్తున్నాయి. ప్లాట్‌ల అభివృద్ధికి పెద్ద డెవలపర్లు రంగంలోకి దిగుతుండటంతో చిన్న, అవ్యస్థీకృత సంస్థలకు గడ్డుకాలమేన'ని అనరాక్‌ గ్రూప్‌ వైస్‌ ఛైర్మన్‌ సంతోశ్‌ కుమార్‌ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)