న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చాలి !

Telugu Lo Computer
0


దేశ రాజధాని దిల్లీలోని విజ్ఞాన్‌ భవన్‌లో శనివారం తొలిసారిగా జిల్లా న్యాయ సేవల అధికారుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో సీజేఐ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ, ప్రధానమంత్రి నరేంద్రమోదీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీజేఐ మాట్లాడుతూ ''న్యాయ ప్రక్రియలో చాలా మంది ప్రజలకు అతి దగ్గరగా ఉండేది జిల్లా న్యాయ సేవల అధికారులే. న్యాయస్థానాలపై ప్రజల అభిప్రాయం జిల్లా స్థాయిలో న్యాయాధికారుల నుంచి వారికి ఎదురయ్యే అనుభవాలపై ఆధారపడి ఉంటుంది. జిల్లాల్లో న్యాయ వ్యవస్థలను పటిష్ఠం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. న్యాయాన్ని ప్రజల ఇంటి గడపకు చేర్చగలగాలి. అలా చేర్చగలిగితే మనమంతా న్యాయమూర్తులు, లాయర్లు, ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేయాలి'' అని అన్నారు.  ఈ సందర్భంగా దేశ యువతపై సీజేఐ ప్రశంసలు కురిపించారు. ''ఈ దేశ నిజమైన బలం యువతలోనే ఉంది. ప్రపంచంలో ఐదో వంతు యువత మన దేశంలోనే ఉంది. అయితే మన శ్రామిక శక్తిలో నైపుణ్యవంతులు కేవలం 3 శాతం మాత్రమే ఉన్నారు. మిగతావారిలోనూ నైపుణ్యాలను పెంచి ఆ శక్తిని ఉపయోగించుకోవాలి'' అని చీఫ్‌ జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. అనంతరం ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ''సులభతర వాణిజ్యం, సులభతర జీవనం లాగే సలుభతర న్యాయమూ అంతే ముఖ్యం. ఇందుకు న్యాయపరమైన మౌలిక సదుపాయాలు ఎంతగానో దోహదపడుతాయి. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలను పటిష్ఠం చేసేందుకు గత ఎనిమిదేళ్లుగా శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ-కోర్టు మిషన్‌లో భాగంగా వర్చువల్‌ కోర్టులను ప్రారంభించాం. ట్రాఫిక్‌ ఉల్లంఘనల వంటి నేరాలను విచారించేందుకు 24 గంటలూ పనిచేసే కోర్టులను తీసుకొస్తున్నాం'' అని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పలు జైళ్లలో న్యాయ సహకారం కోసం ఎదురుచూస్తోన్న అండర్‌ట్రయల్‌ ఖైదీల విడుదలకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని న్యాయస్థానాలను మోదీ కోరారు. ఈ కార్యక్రమంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)