మంకీపాక్స్ నివారణకు మార్గదర్శకాలు విడుదల

Telugu Lo Computer
0


దేశంలో తొలి మంకీపాక్స్ కేసు కేరళలో నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. మంకీపాక్స్ నివారణకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ కొన్ని మార్గదర్శకాలు విడుదల చేసింది. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం.. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి లేదా లక్షణాలు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. రోగి ఉపయోగించే బెడ్, ఇతర వస్తువులు వంటివి వాడరాదు. మంకీపాక్స్ సోకిన రోగులను ఐసోలేషన్‌లో ఉంచాలి. ఈ వ్యాధి సోకిన వ్యక్తులు లేదా జంతువులకు దగ్గరగా ఉన్నట్లైతే పూర్తి శుభ్రత పాటించాలి. చేతులు సోప్ వాటర్‌తో శుభ్రంగా కడుక్కోవడం, ఆల్కహాల్ కలిగిన శానిటైజర్ వాడటం చేయాలి. రోగికి దగ్గరగా వెళ్లాల్సి వచ్చినప్పుడు పీపీఈ కిట్ ధరించాలి. విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ మంకీపాక్స్ లక్షణాలు, చర్మ సమస్యలు, జననేంద్రియ సమస్యలు ఉన్నవారికి దూరంగా ఉండాలి. ఆఫ్రికాకు చెందిన అడవి జంతువుల మాంసంతో తయారు చేసిన ఆహార పదార్థాలు తినకూడదు. రోగ లక్షణాలు 21 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. అందువల్ల మంకీపాక్స్ రోగిని కలిస్తే కనీసం 21 రోజులపాటు జాగ్రతలు తీసుకోవాలి. మంకీపాక్స్ సోకిన రోగులు ఐసోలేషన్‌లో ఉంటూ సర్జికల్ మాస్క్ ధరించాలి. వైరల్ డీఎన్ఏ సీక్వెన్స్ పరీక్ష ద్వారా ఈ వ్యాధిని గుర్తిస్తారు. మంకీపాక్స్ నమోదైన దేశాలకు వెళ్లొచ్చిన వారు 21 రోజులు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటివరకు 62 దేశాల్లో మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. మంకీపాక్స్ ప్రాణాంతకమయ్యే అవకాశాలు చాలా తక్కువ. అందువల్ల రోగ లక్షణాలను బట్టి చికిత్స అందించవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)