ఉత్తర కొరియా బ్యాలిస్టిక్ మిసైల్‌ను ప్రయోగం ?

Telugu Lo Computer
0


అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలు ముగిసిన మర్నాడే ఉత్తర కొరియా ఓ బ్యాలిస్టిక్ మిసైల్‌ను సముద్రంపైకి ప్రయోగించింది. ఉత్తర కొరియా తూర్పు తీరంలో గుర్తు తెలియని క్షిపణిని ఆదివారం ప్రయోగించిందని దక్షిణ కొరియా పేర్కొంది. అనుమానాస్పద బ్యాలిస్టిక్ మిసైల్‌ను ఉత్తర కొరియా ప్రయోగించిందని జపాన్  ప్రభుత్వం కూడా పేర్కొంది. అమెరికా, దక్షిణ కొరియా  సంయుక్త సైనిక విన్యాసాలు శనివారం ముగిశాయి. ఉత్తర కొరియా ఆదివారం ఈ బ్యాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా చెప్తోంది. ఉత్తర కొరియా ఓ గుర్తు తెలియని క్షిపణిని ప్రయోగించిందని దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ తెలిపారు. ఉత్తర కొరియా వ్యవహారాలపై అమెరికా ప్రతినిధి సుంగ్ కిమ్ సియోల్‌లో శుక్రవారం పర్యటించారు. ఆయన దక్షిణ కొరియా ప్రతినిధి కిమ్ గున్న్, జపనీస్ ప్రతినిధి టకెహిరో ఫునకోషిలతో సమావేశమయ్యారు. 2017 తర్వాత మొదటి అణు పరీక్షలకు ఉత్తర కొరియా సన్నాహాలు చేస్తున్నట్లు సంకేతాలు వస్తున్న నేపథ్యంలో ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వీరు నిర్ణయించారు. సుంగ్ కిమ్ మాట్లాడుతూ, దౌత్య పరిష్కారాలకు సిద్ధంగా ఉన్నట్లు ఉత్తర కొరియాకు అమెరికా స్పష్టంగా చెప్పిందన్నారు. ఆంక్షల సడలింపు వంటి అంశాలపై చర్చించేందుకు అమెరికా సుముఖత వ్యక్తం చేసిందన్నారు. ఆయన పర్యటన ఆదివారంతో ముగిసింది. ఉత్తర కొరియా బ్యాలిస్టిక్ మిసైల్స్‌ను ప్రయోగిస్తుండటంతో ఆ దేశంపై మరిన్ని ఆంక్షలను విధించాలని ఐక్య రాజ్య సమితిని అమెరికా ఇటీవల కోరింది. అయితే ఈ ప్రతిపాదనను చైనా, రష్యా తోసిపుచ్చాయి. ఉత్తర కొరియా విషయంలో ఐరాస భద్రతా మండలి బాహాటంగా చీలిపోయింది. 2006లో ఉత్తర కొరియా మొదటి అణు పరీక్షను నిర్వహించింది. అప్పటి నుంచి ఆ దేశాన్ని ఐరాస శిక్షిస్తోంది. ఇటీవల ఉత్తర కొరియా అతి పెద్దదైన ఇంటర్‌కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్‌ సహా అనేక మిసైల్స్‌ను పరీక్షించింది. అమెరికా, దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలను ఉత్తర కొరియా ఖండించింది. ఓ వైపు దౌత్యం గురించి మాట్లాడుతూనే తమ దేశం పట్ల శత్రుత్వ విధానాలను అమెరికా కొనసాగిస్తోందని మండిపడింది.

Post a Comment

0Comments

Post a Comment (0)