పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు

Telugu Lo Computer
0


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సద్గురు జగ్గీవాసుదేవ్‌ నేతృత్వంలో కొనసాగుతోన్న 'సేవ్‌ సాయిల్‌  ఉద్యమం' నిర్వాహకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ క్రమంలో పెట్రోల్‌లో పదిశాతం ఇథనాల్‌ కలపాలనే లక్ష్యాన్ని భారత్‌ ఐదు నెలల ముందుగానే సాధించిందని ప్రధాని మోదీ ప్రకటించారు. 'పెట్రోల్‌లో ఇథనాల్‌ కలపడం 2014లో 2శాతం ఉండగా, ప్రస్తుతం దాన్ని 10 శాతానికి తీసుకు వచ్చాం. దీంతో 27లక్షల టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గించాం. తద్వారా రూ.40వేల కోట్ల విదేశీ మారక నిల్వలను ఆదా చేయగలిగాం' అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాకుండా శిలాజేతర ఇంధనాలతో 40శాతం విద్యుదుత్పత్తి చేయాలనే లక్ష్యాన్ని కూడా తొమ్మిదేళ్ల ముందుగానే సాధించామన్నారు. గడిచిన ఎనిమిదేళ్లలో దేశంలో 20వేల చదరపు కి.మీ అటవీ విస్తీర్ణం పెరిగిందని గుర్తుచేసిన ఆయన, వీటివల్ల అటవీ జంతువుల సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోందన్నారు. ఇక భూసారంపై రైతులకు అవగాహన లేకపోయేదని.. కానీ, ఈ సమస్యను అధిగమించడంతోపాటు భూసారంపై వారికి అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులను అందజేసిందన్నారు. భూమి తన సారాన్ని కోల్పోతున్న నేపథ్యంలో దానిని మెరుగుపరచడంలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా అవగాహన కలిగించేందుకు సద్గురు జగ్గీవాసుదేవ్ 'సేవ్‌ సాయిల్‌ ఉద్యమాన్ని' మొదలుపెట్టారు. ఇందులో భాగంగా 27 దేశాల్లో 100 రోజులపాటు బైక్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో 75వ రోజున దిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ నేపథ్యంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని మోదీ వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)