మమత మీటింగ్ కు కేసీఆర్ డుమ్మా?

Telugu Lo Computer
0


రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రావడంతో జాతీయ రాజకీయాలు వేడెక్కాయి. విపక్షాల నుంచి ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టాలని ప్లాన్ చేస్తున్న పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢిల్లీలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. జూన్ 15న జరగనున్న ఈ సమావేశానికి 8 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వివిధ పార్టీల నేతలను మమత ఆహ్వానించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఫోన్ చేసి పిలిచారు. దీంతో మమతా బెనర్జీ సమావేశంలో సీఎం కేసీఆర్ కీలకంగా ఉండబోతున్నారనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా కేసీఆర్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. మమతా బెనర్జీ సమావేశానికి ఆయన హాజరు కావడం లేదు. తాను వెళ్లకుండా టీఆర్ఎస్ పార్టీ ప్రతినిధిగా సీనియర్ నేత కేశవరావును ఢిల్లీకి పంపాలని కేసీఆర్ నిర్ణయించారని తెలుస్తోంది. మమతా బెనర్జీ నిర్వహిస్తున్న విపక్ష నేతల సమావేశానికి కేసీఆర్ హాజరుకాకపోవడం ఇప్పుడు చర్చగా మారింది. బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటం చేస్తానంటున్న కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల కోసం నిర్వహిస్తున్న కీలక సమావేశానికి ఎందుకు డుమ్మా కొడుతున్నారన్నది ప్రశ్నగా మారింది. జాతీయ స్థాయిలో కూటమి కాకుండా సొంత పార్టీతోనే ముందుకు వెళ్లాలని కేసీఆర్ డిసైడ్ కావడం వల్లే విపక్ష నేతల సమావేశానికి వెళ్లడం లేదని చెబుతున్నారు. మమత బెనర్జీ సమావేశానికి కాంగ్రెస్ కు కూడా ఆహ్వానం ఉంది. ఇది కూడా కేసీఆర్ వెళ్లకపోవడానికి కారణం అంటున్నారు. కొంత కాలంగా బీజేపీతో పాటు కాంగ్రెస్ పైనా ఆరోపణలు చేస్తున్నారు కేసీఆర్. ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో కాంగ్రెస్ తో కలిసి సమావేశంలో పాల్గొంటే తప్పుడు సంకేతాలు వెళతాయనే అభిప్రాయంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. రాష్ట్రంలోనూ టీఆర్ఎస్ కు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే బీజేపీ నేతలు టీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేనని ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సోనియాతో కలిసి వేదిక పంచుకుంటే బీజేపీకి ఇది ప్రచార అస్త్రంగా మారవచ్చనే ఆందోళనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. అందుకే తాను వెళ్లకుండా కేకేను సమావేశానికి పంపాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారని అంటున్నారు. సమావేశం తర్వాత జరిగే పరిణామాల ఆధారంగా తదుపరి అడుగులు వేసే యోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)