అమ్మఒడి అందేది ఎందరికి ?

Telugu Lo Computer
0

 


వైఎస్ఆర్ పార్టీ ప్రతిష్ఠాత్మకమని చెబుతున్న 'అమ్మఒడి' పథకంలో ప్రభుత్వం అడుగడుగునా ఆంక్షలు అమలు చేసి లబ్ధిదారులను వడపోసింది. లబ్ధిదారులకు రూ.15 వేలు పంపిణీ చేయాల్సిన చోట రూ.13 వేలే పంపిణీ చేస్తామని ప్రకటించింది. ఈ నగదు పంపిణీ బాధ్యతను గతంలో పాఠశాలలే నిర్వహిస్తుండగా.. ఇప్పుడు గ్రామ/వార్డు వాలంటీర్లకు బదలాయించింది. ఈ పథకం అందుకోవాలంటే లబ్ధిదారులు ఏడంచెల ధ్రువీకరణలో ఉత్తీర్ణులు కావాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే అమ్మఒడి పథకం వర్తిస్తుందన్న నిబంధనతో తల్లులు- పిల్లలు బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఇన్ని ఆంక్షల మధ్య పేద పిల్లలు అమ్మఒడి ప్రయోజనాలు అందుకోలేకపోతున్నారు. గత రెండు విడతలుగా అర్హత ఉన్నవారిలో కొందరు ఇప్పుడు కోల్పోతుండడం విశేషం. 300 యూనిట్ల లోపు విద్యుత్తు వినియోగం, 75 శాతం హాజరు తదితర వేర్వేరు కారణాలతో అమ్మఒడి పథకంపై ఆంక్షలు విధిస్తూ లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిందనే విమర్శలు ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్నాయి. పథకాన్ని జనవరిలోనే అమలు చేస్తామని, లబ్ధిదారుల వడపోతలో భాగంగా జూన్‌ మాసానికి వాయిదా వేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నవంబరు 8 నుంచి ఏప్రిల్‌ 30వ తేదీ వరకు విద్యార్థి హాజరు 75 శాతం ఉంటేనే పథకం కింద సాయం అందిస్తామనే షరతు పెట్టింది. అమ్మఒడి పథకాన్ని 2021-22 ఆర్థిక సంవత్సరంలో అమలు చేయలేదు. గతేడాది జనవరి 11న ఈ పథకం కింద తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమచేయగా, ఈ ఏడాది విద్యార్థుల హాజరు లెక్కింపు పేరుతో జూన్‌కు మార్చారు. అమ్మఒడి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. 300 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్నవారికే ఈ పథకం వర్తిస్తుందని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఎప్పుడూ లేనంతగా ఈ వేసవిలో ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఫ్యాన్ల వినియోగం పెరిగింది. దీంతో కొందరికి 300 యూనిట్ల వినియోగం దాటింది. నగదు వద్దనుకునే వారికి ల్యాప్‌టాప్‌లు ఇస్తామంటూ విద్యార్థుల నుంచి ఐచ్చికాలను గతంలో కోరింది. ఈ జాబితాలోని వారికి ఈ విద్యాసంవత్సరానికి నగదు లబ్ధిదారుల పేర్లలో చేర్చారు. ప్రభుత్వ, ప్రైవేటులో ఒకటి నుంచి 12 తరగతుల వరకు చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద రూ.15 వేలు చెల్లిస్తామని 2019-2020లో ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికీ మూడు విద్యా సంవత్సరాలు పూర్తికాగా.. రెండుసార్లు మాత్రమే నగదు చెల్లించారు. బియ్యంకార్డులో తప్పనిసరిగా తల్లి, పిల్లల పేర్లు ఉండాలనే షరతు పెట్టారు. కొంత మంది వివిధ కారణాలతో వారి సంరక్షకుల కార్డుల్లో పిల్లల పేర్లు చేర్చుకున్నారు. దీంతో చాలా మందిని అనర్హులుగా చేర్చారు. ఈసారి తమకు లబ్ధి కలుగుతుందో, లేదో అనే ఆందోళన అందరిలో నెలకొంది. ఇప్పటికే హాజరు 75 శాతం ముడిపెట్టడంతో చాలా మంది అర్హత కోల్పోయారు. తాజాగా ఈకేవైసీ కారణంగా ఆధార్‌లో వయసు, లింగం, చిరునామా, పేర్లు తప్పులతో పాటు హౌస్‌ హోల్డ్‌ మ్యాపింగ్‌, గతంలో ఉన్న చిరునామాలో లేకపోవడం తదితర కారణాలతో అనర్హులుగా తేల్చేస్తున్నారు. అర్హత, అనర్హత జాబితాలో పేర్లు లేకపోవడంపై సచివాలయాలకు చేరుకుని నిలదీస్తున్నా సమాధానం చెప్పే వారు లేరు. జగనన్న అమ్మఒడి పథకం కింద సోమవారం అర్హులైన తల్లుల ఖాతాలలో ప్రభుత్వం నగదు జమచేయనుంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకాకుళంలో కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నగదు జమచేయనున్నారు. జిల్లాకు సంబంధించి కలెక్టరేట్‌లోని సభాభవనంలో ఈ కార్యక్రమం జరగనుంది. జిల్లాకు సంబంధించి 1,87,742 మందికి రూ.281.61 కోట్లు, ఒక్కొక్కరికి రూ.13 వేల చొప్పున జమచేయనున్నారు. మిగిలిన రూ.2 వేలు పాఠశాలలు, పారిశుద్ధ్య నిర్వహణకు వినియోగించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)