బీజేపీ దేశ ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది

Telugu Lo Computer
0


రాజస్థాన్ లోని బన్స్వారా జిల్లా కరణ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ ప్రధాని మోదీ దేశాన్ని రెండుగా విభజించారని, ఒకటి ధనికుల కోసం మరొకటి పేదల కోసం అంటూ విమర్శించారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న ఆర్ధిక, నిరుద్యోగ సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ బీజేపీ పాలనలో ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిందన్నారు. మోదీ ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు, జీఎస్టీ అమలు కారణంగానే నేడు ఆర్ధిక వ్యవస్థ నాశనం అయిందని రాహుల్ అన్నారు. యూపీఏ హయాంలో దేశ ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేశామని, అందుకే ఇప్పటికీ దేశాన్ని ముందుకు నడిపించగలిగేది కాంగ్రెస్ పార్టీయేనని ప్రజలు నమ్ముతున్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న బీజేపీ నేతలకు తాను భయపడబోనని, దేశ భవిష్యత్తుకు సంబంధించిన ఈ విషయంలో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతామని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ రోడ్లపైకి వచ్చి పోరాటం చేస్తుందని అన్నారు. భారత దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, ప్రజల మధ్య చర్చకు దారి తీసే అంశాలను బీజేపీ క్రమపద్ధతిలో నాశనం చేసిందని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ పాలనలో దేశంలో సంస్థలు విచ్చిన్నాన్ని ఎదుర్కొంటున్నాయని, ధరల పెరుగుదల, నిరుద్యోగం కారణంగా జీవన ప్రమాణాలు కాస్త జీవన ప్రమాదాలుగా మారుతున్నాయని రాహుల్ గాంధీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)