బీజేపీ వైఖరితో పర్యాటక ప్రదేశాలకు నష్టం

Telugu Lo Computer
0


బీజేపీ అనుసరిస్తున్న వైఖరితో దేశంలోని పర్యాటక ప్రదేశాలు నష్టపోతున్నాయని జమ్ము-కాశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ  మీడియాతో మాట్లాడుతూ  విమర్శించారు. ''దేశంలోకి వచ్చే టూరిస్టుల్లో సగం మంది మొఘల్ కాలం నాటి నిర్మాణాల్ని చూసేందుకే వస్తారు. మిగతా సగం కాశ్మీర్ అందాల్ని చూసేందుకు వస్తారు. అయితే, బీజేపీ అటు మొఘలుల నిర్మాణాల్ని, ఇటు కాశ్మీర్‌ను నాశనం చేస్తోంది. దీని ప్రభావం పర్యాటక రంగంపై ఉంటుంది'' అని మెహబూబా ముఫ్తీ అన్నారు. ఇటీవల కాలంలో కాశ్మీర్ అంశంతోపాటు, మొఘల్ కాలం నాటి నిర్మాణాలపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా మొఘలులు నిర్మించిన అనేక కట్టడాల పేర్లు మార్చాలని బీజేపీ, హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కుతుబ్ మినార్ పేరును విష్ణు స్తంభ్‌గా మార్చాలని ఇటీవల డిమాండ్ మొదలైంది. అలాగే దేశ రాజధాని ఢిల్లీలోని అక్బర్ రోడ్, హుమాయున్ రోడ్, ఔరంగజేబ్ లేన్, తుగ్లక్ లేన్ వంటి మొఘల్ చక్రవర్తుల పేర్లతో ఉన్న ప్రదేశాల పేర్లను మార్చాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇలాంటి చర్యలపై మెహబూబా ముఫ్తీ స్పందించారు. ''కాశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ వైఖరి మారాలి. కాశ్మీరీలపై ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది. ఇక్కడ హిందూ, ముస్లింల అంశాన్ని తెరపైకి తెచ్చి, దేశంలోని కీలకమైన సమస్యలపై ప్రజల దృష్టి మళ్లిస్తోంది'' అన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)