ప్రవేశాల పర్యవేక్షణకు నోడల్‌ ఏజెన్సీ కి బీపీఆర్‌డీ సిఫార్సు

Telugu Lo Computer
0


పాఠశాలలు, కళాశాలలు, దేశ, విదేశీ విశ్వవిద్యాలయాల ప్రవేశాల్లో అవకతవకల నివారణకు ఒక కేంద్రీకృత నోడల్‌ ఏజెన్సీ ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖకు 'బ్యూరో ఆఫ్‌ పోలీస్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌' (బీపీఆర్‌డీ) సిఫార్సు చేసింది. విద్యాసంస్థల్లో ప్రవేశ వ్యవహారాలు చూసే సంస్థలు, కోచింగ్‌ కేంద్రాల వివరాలను సేకరించి, వాటి పనితీరును రాష్ట్ర నోడల్‌ ఏజెన్సీల సమన్వయంతో పర్యవేక్షించే బాధ్యతలను ఈ ఏజెన్సీకి అప్పగించాలని ఇందులో పేర్కొంది. రాష్ట్రస్థాయి నోడల్‌ ఏజెన్సీ కింద జిల్లాస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఏజెన్సీల మోసాల గురించి బాధితులు ఫిర్యాదు చేస్తే వాటిపై విచారణ జరిపే బాధ్యతలను ఈ కమిటీలకు అప్పగిస్తారు. ఇవి ప్రాథమిక విచారణ జరిపి తదుపరి దర్యాప్తు కోసం పోలీసులకు నివేదిక అందిస్తాయి. ఏజెన్సీ తప్పుచేసిందని పోలీసులు తేలిస్తే ఆ సంస్థను ప్రవేశాల బాధ్యతల నుంచి తప్పిస్తారు. ఇలాంటి సంస్థల నిర్వహణ కోసం కేంద్రం జారీచేసే ప్రామాణిక నిబంధనలను సక్రమంగా పాటిస్తున్నారా? లేదా? అనే వివరాలు తెలుసుకోవడానికి జిల్లాస్థాయి కమిటీలు తమ పరిధిలో ఉండే ప్రవేశ కల్పన సంస్థలను తరచూ సందర్శిస్తాయి. జిల్లాస్థాయి కమిటీల్లో కలెక్టర్‌, ఎస్పీ, పౌర సమాజ ప్రతినిధి, విద్యాశాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. 100 మందికి మించి విద్యార్థులున్న కోచింగ్‌ సెంటర్లు 'షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ చట్టం' కింద నమోదయ్యేలా నిబంధన విధించాలి. ప్రతి శిక్షణ సంస్థ తప్పనిసరిగా యజమాని పేరు, ఫోన్‌ నంబర్‌, నమోదు సంఖ్య, చెల్లుబాటు తేదీ, నిర్వహించే కోర్సులు, అనుబంధ గుర్తింపు వంటి వివరాలు ప్రదర్శించాలి. వాటిని వెబ్‌సైట్లలోనూ పొందుపరచాలి. ఒకవేళ ఇలాంటి విద్యాసంస్థలు తీవ్ర మోసానికి పాల్పడితే వాటి దర్యాప్తు బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని 'తీవ్ర నేరాల దర్యాప్తు కార్యాలయా'నికి అప్పగించాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)