నిరుద్యోగం నుంచి దృష్టి మరల్చేందుకే లౌడ్‌స్పీకర్ల గొడవ

Telugu Lo Computer
0


దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగంపై ప్రజల దృష్టి మరల్చేందుకే లౌడ్‌స్పీకర్లు, బుల్డోజర్ల అంశాన్ని బీజేపీ తెరపైకి తెచ్చిందని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్‌ దుయ్యబట్టారు. '1925లో లౌడ్‌ స్పీకర్లను కనుగొన్నారు. వీటిని భారత్‌లో 1970లలో ప్రవేశపెట్టారు. లౌడ్‌ స్పీకర్లు లేనప్పుడు దేవుడు లేడా? లౌడ్‌ స్పీకర్లు లేనప్పుడు కూడా భజనలు, ప్రార్థనలు జరిగాయి' అంటూ లౌడ్‌స్పీకర్ల అంశాన్ని రాద్ధాంతం చేస్తున్న వారికి కౌంటర్‌ ఇచ్చారు. కొద్ది రోజులుగా కులం, మతం పేరిట దేశాన్ని వెనక్కి తీసుకువెళ్లాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్‌ ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగం వంటి అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకు హనుమాన్‌ చాలీసా వంటి అంశాలను తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. బీజేపీ దేశంలో కృత్రిమ సమస్యలను సృష్టిస్తున్నదని పశ్చిమ బెంగాల్‌కు చెందిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అభిషేక్‌ మను మండిపడ్డారు. జాతీయ భాషగా హిందీ, హిజాబ్‌ అంశాలు తెరపైకి తెచ్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నదని పేర్కొన్నారు. మసీదుల్లో లౌడ్‌ స్పీకర్లు తొలగించకపోతే వాటి ముందు లౌడ్‌ స్పీకర్ల ద్వారా హనుమాన్‌ చాలీసా వినిపిస్తామంటూ ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ఠాక్రే హెచ్చరించడంతో ఈ వివాదం తెరపైకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా, ఎంఎన్‌ఎస్‌ చేపట్టిన హనుమాన్‌ చాలీసా వివాదంలో తాము పాలుపంచుకోబోమని వీహెచ్‌పీ స్పష్టం చేసింది. తాము కానీ, బజరంగ్‌దళ్‌ కానీ ఈ విషయంలో ఏ పార్టీకీ మద్దతు ఇవ్వలేదని పేర్కొంది. ఇదిలాఉండగా.. ఉత్తరప్రదేశ్‌లో మతపరమైన ప్రదేశాల్లో అనధికారికంగా ఏర్పాటు చేసిన 53,942 లౌడ్‌స్పీకర్లను అధికారులు తొలగించారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 60,295 లౌడ్‌స్పీకర్లకు పరిమిత ధ్వని మాత్రమే పెట్టుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. మతం పేరిట ప్రజల మధ్య విభజనకు బీజేపీ ఎంత ప్రయత్నిస్తున్నా ప్రజలు ఇవేవీ పట్టించుకోవట్లేదు. పాట్నాలో 50 మీటర్ల దూరంలో ఉన్న ఆలయం, మసీదులు ఇందుకు వేదికగా నిలిచాయి. అజాం సమయంలో గుడిలో పూజలు, గంటల శబ్దాలు లేకుండా పూజారులు చూసుకుంటున్నారు. గుడికి వచ్చే భక్తులకు మసీదు నిర్వాహకులు వసతులు ఏర్పాట్లు చేస్తున్నారు. 'అజాంతో మాకు సమస్య లేదు. మా భజనలతో వారికీ ఇబ్బంది లేదు. ఒకరికొకరు సాయం చేసుకుంటున్నాం'అని ఆలయ చైర్మన్‌ కిశోర్‌ కునాల్‌ వివరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)