యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవ శిక్ష !

Telugu Lo Computer
0


ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతో పాటు దేశంపై దాడికి కుట్ర తదితర నేరాల్లో యాసిన్‌ మాలిక్‌ ను  దోషిగా తేల్చిన దిల్లీలోని పాటియాలా హౌస్‌ (ఎన్‌ఐఏ) కోర్టు బుధవారం వివిధ కేసుల్లో విడివిడిగా శిక్షలు ఖరారు చేసింది. అవన్నీ ఏకకాలంలో అమలవుతాయని తెలిపింది. ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌సింగ్‌ ఈ తీర్పును వెలువరించారు. మాలిక్‌కు గరిష్ఠంగా మరణశిక్ష విధించాలని అంతకు ముందు కోర్టుకు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) విజ్ఞప్తి చేసింది. మాలిక్‌ తరఫు న్యాయవాది మాత్రం యావజ్జీవ శిక్షతో సరిపుచ్చాలని కోరారు. వివిధ కేసులకు అనుగుణంగా పలు శిక్షలు, జరిమానాలు మాలిక్‌కు పడ్డాయని న్యాయవాది ఉమేశ్‌ శర్మ తెలిపారు. ఈ శిక్షలపై హైకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశాన్ని కోర్టు మాలిక్‌కు ఇచ్చింది. తాను నేరస్థుడినైతే అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రభుత్వం తనకు పాస్‌పోర్టు మంజూరు చేసి ప్రపంచమంతా ప్రయాణించడానికి ఎందుకు అవకాశమిచ్చిందని మాలిక్‌ ప్రశ్నించాడు. 1994లో తాను ఆయుధాలు విడిచిపెట్టినప్పటి నుంచి మహాత్మా గాంధీ సిద్ధాంతాలను అనుసరిస్తున్నట్లు తెలిపాడు. కాశ్మీర్‌లో అహింసా రాజకీయాలనే చేసినట్లు వివరించాడు. గత 28 ఏళ్లలో ఉగ్రవాద కార్యకలాపాలు లేదా హింసలో తనకు పాత్ర ఉందని నిఘా వర్గాలు నిరూపిస్తే తాను రాజకీయాలను విడిచిపెడతానని, అలాగే మరణశిక్షకు కూడా సిద్ధమేనని యాసిన్‌ మాలిక్‌ పేర్కొన్నాడు. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారన్న కేసులో చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద మోపిన అన్ని రకాల అభియోగాల్లోను మాలిక్‌ను ఎన్‌ఐఏ కోర్టు ఈ నెల 19న దోషిగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా జరిమానా విధించడానికి ఆయన ఆర్థిక స్థితిగతులపై పరిశీలన జరిపి అఫిడవిట్‌ ఇవ్వాలని జాతీయ దర్యాప్తు సంస్థను న్యాయమూర్తి ఆదేశించిన సంగతి విదితమే. ఈ కేసులో లష్కరే తోయిబా వ్యవస్థాపకుడు హఫీజ్‌ సయీద్‌, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ చీఫ్‌ సయ్యద్‌ సలావుద్దీన్‌ సహా పలువురు వేర్పాటువాద నేతలపైనా ఎన్‌ఐఏ అభియోగాలు దాఖలు చేసింది. జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాద కార్యకలాపాల నిర్వహణలో యాసిన్‌ మాలిక్‌ నేతృత్వం వహించిన జేకేఎల్‌ఎఫ్‌ ముందు స్థానంలో ఉంటుంది. 1989లో జరిగిన కశ్మీరీ పండిట్‌ల హత్యల్లోనూ ఆ సంస్థ పాత్ర ఉందని ఆరోపణలున్నాయి. జేకేఎల్‌ఎఫ్‌ దురాగతాలతో కశ్మీర్‌ నుంచి భారీ సంఖ్యలో పండిట్‌లు వలస వెళ్లారు. 1984లో జరిగిన భారత దౌత్యవేత్త రవీంద్ర మాత్రే హత్యతోనూ ఆ సంస్థకు సంబంధాలు ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)