పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మళ్లాలి !

Telugu Lo Computer
0


దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు థర్మల్‌ విద్యుత్తు ఉత్పత్తి నుంచి క్రమంగా పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మళ్లాలని, ఈ కార్యక్రమ పర్యవేక్షణ కోసం రాష్ట్ర స్థాయుల్లో స్టీరింగ్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని కేంద్ర విద్యుత్తు మంత్రి ఆర్‌.కె.సింగ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు. 2024 కల్లా వ్యవసాయ అవసరాల కోసం డీజిల్‌ వినియోగాన్ని జీరోకు తీసుకురావాలని సూచించారు. నీటిని తోడేందుకు సౌర విద్యుత్తు వాడాలని కోరారు. పీఎం - కుసుం స్కీం కింద వ్యవసాయ ఫీడర్లను వేరుచేసి వాటికి సౌర విద్యుత్తు అందించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పనిచేసే స్టీరింగ్‌ కమిటీల్లోకి రాష్ట్ర ఇంధన, రవాణా, పరిశ్రమలు, గృహనిర్మాణం, పట్టణ వ్యవహారాలు, వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, రహదారులు.. భవనాల శాఖల ముఖ్య కార్యదర్శులను సభ్యులుగా నియమించాలని సూచించారు. రాష్ట్రంలో ఏటా ఎంతమేర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని పెంచాలో లక్ష్యం నిర్దేశించుకొని దానిని చేరేలా చూసే బాధ్యత ఈ కమిటీదేనని పేర్కొన్నారు. కర్బన ఉద్గారాలను తగ్గిస్తామని అంతర్జాతీయ వేదికలపై ఇచ్చిన హామీలను నిలబెట్టుకోడానికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి వైపు మళ్లడం ఒక్కటే మార్గమని అభిప్రాయపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌, కేరళ, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ వంటి రాష్ట్రాల్లో స్టీరింగ్‌ కమిటీలను ఇప్పటికే ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న విద్యుత్తు డిమాండును అందుకోడానికి ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న విద్యుత్తుతో పునరుత్పాదక ఇంధనం కలిపి వాడుకోవడం అత్యవసరమని పేర్కొన్నారు. ఇందుకోసం బయోమాస్‌, గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగాన్ని పెంచాలని కోరారు. అలాగే ఇంధన సామర్థ్యాన్నీ పెంచుకోవాలని సూచించారు. 2005 నాటి కర్బన ఉద్గారాలతో పోలిస్తే 2030 నాటికల్లా 45% తగ్గించడమే లక్ష్యమని, దీన్ని అందుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర కీలకమని ఆర్‌.కె.సింగ్‌ పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)