సమీర్‌ వాంఖడేపై నీలి నీడలు !

Telugu Lo Computer
0


ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చిన నేపథ్యంలో ఆ కేసును తొలుత దర్యాప్తు చేసిన అప్పటి ఎన్‌సీబీ అధికారి సమీర్‌ వాంఖడే భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ కేసు దర్యాప్తు ప్రారంభంలో నిర్లిప్తంగా వ్యవహరించినందుకు గానూ వాంఖడేపై చర్యలు తీసుకోవాలని ఇటీవల కేంద్రం ఆదేశించింది. ఈ క్రమంలోనే తాజాగా ఆయనను ముంబయి నుంచి చెన్నైకు బదిలీ చేయడం గమనార్హం. డ్రగ్స్‌ కేసులో గతేడాది అక్టోబరు 3న ఆర్యన్‌ ఖాన్‌ అరెస్టయిన సంగతి తెలిసిందే. ఈ కేసులో అప్పటి ఎన్‌సీబీ ముంబయి జోనల్‌ డైరెక్టర్‌ సమీర్‌ వాంఖడే నేతృత్వంలో దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ సమయంలో వాంఖడేపై అనేక విమర్శలు వచ్చాయి. డబ్బుల కోసం బ్లాక్‌మెయిల్‌ చేసేందుకే క్రూజ్‌ డ్రగ్స్‌ కేసులో ఆర్యన్‌ సహా పలువురిని అరెస్టు చేసినట్లు ఆయనపై ఆరోపణలు వచ్చాయి. అంతేగాక, నకిలీ కుల ధ్రువీకరణ పత్రంతో ఉద్యోగం పొందినట్లు ఎన్‌సీపీ నేతలు ఆరోపించారు. దీంతో వాంఖడే రాజకీయ వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు. ఈ క్రమంలోనే ఎన్‌సీబీ జోనల్ డైరెక్టర్‌గా వాంఖడే పదవీ కాలం ముగియడంతో ఆయనను ముంబయిలోని డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ)కు బదిలీ చేశారు. ఎన్‌సీబీ గతవారం ఆర్యన్‌ ఖాన్‌కు క్లీన్‌చిట్‌ ఇచ్చింది. ఆర్యన్‌పై అభియోగాలను నిరూపించగల బలమైన భౌతిక సాక్ష్యాధారాలేవీ లభించలేదని పేర్కొంది. దీంతో ఈ కేసులో సమీర్‌ వాంఖడే నేతృత్వంలోని ఎన్‌సీబీ దర్యాప్తుపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. డ్రగ్స్‌ కేసులో వాంఖడే బృందం నిర్లిప్తంగా వ్యవహరించి, పలు అవకతవకలకు పాల్పడినట్లు సిట్‌ దర్యాప్తులో తేలింది. దీంతో ఆయనపై కేంద్రం చర్యలకు ఉపక్రమించింది. ఈ క్రమంలోనే ఆయనను చెన్నైలోని డీజీ ట్యాక్స్‌పేయర్‌ సర్వీస్‌ డైరెక్టరేట్‌కు బదిలీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)