భక్తులతో కిటకిటలాడిన రామేశ్వరం

Telugu Lo Computer
0


సుప్రసిద్ధ శైవక్షేత్రం రామేశ్వరం అగ్నితీర్థం అమావాస్యను పురస్కరించుకుని సోమవారం ఉదయం పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు, పుణ్యస్నానాలకు విచ్చేసిన వేలాదిమంది భక్తులతో కిటకిటలాడింది. పుణ్యక్షేత్రమైన రామేశ్వరంలోని రామనాథస్వామివారి ఆలయాన్ని దర్శించేందుకు ప్రతిరోజూ దేశవిదేశాల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ప్రత్యేకించి అమావాస్య రోజుల్లో ఈ క్షేత్రం సమీపంలోని అగ్నితీర్థంలో పుణ్యస్నానాలకు, పితృదేవతలకు తర్పణాలు వదిలేందుకు భక్తులు రావడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో వైయ్యాసి నెలలో వచ్చిన సర్వ అమావాస్య సందర్భంగా సోమవారం వేకువజాము ఐదుగంటలకే రామేశ్వరం సమీపంలో అగ్నితీర్థానికి భక్తులు తరలివచ్చారు. కడలిలో స్నానమాచరించిన భక్తులు తమ పితృదేవతల ఆత్మశాంతి కోసం తర్పణాలు వదిలారు. అగ్నితీర్థం మండపం మెట్ల నుంచి కడలి తీరం వరకూ తర్పణాలు పెట్టేందుకు వచ్చిన భక్తులతో నిండిపోయింది. ఆలయ ఉత్తర ముఖద్వారం నుంచి తూర్పు ముఖ ద్వారం వరకు పుణ్యతీర్థాల్లో స్నానాలకు వచ్చిన భక్తులు బారులు తీరారు. ఇదే విధంగా ఆలయంలో స్వామివారిని, అమ్మవారిని దర్శనం చేసుకునేందుకు కూడా భక్తులు క్యూలైన్లలో నిలిచారు. సోమవారం ఉదయం ఆరుగంటల నుంచి రామేశ్వర ఆలయం చుటూ ఎన్నడూ లేనంతగా వేల సంఖ్యలో భక్తులు గుమికూడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)