లెఫ్టినెంట్ ర్యాంకుకు ఎంపికైన గల్వాన్ అమర వీరుని సతీమణి

Telugu Lo Computer
0


దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన లాన్స్ నాయక్ దీపక్ సింగ్ సతీమణి రేఖ సింగ్ అరుదైన ఘనత సాధించారు. భారత సైన్యం లో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. భర్త నుంచి స్ఫూర్తి పొందిన ఆమె టీచర్ ఉద్యోగాన్ని వదిలి, పట్టుదలతో కృషి చేసి, భరత మాతకు సేవ చేయాలనే తన లక్ష్యాన్ని సాధించారు. లాన్స్ నాయక్ దీపక్ సింగ్ 2020 జూన్‌లో చైనా సైన్యంతో గల్వాన్  లోయలో జరిగిన ఘర్షణలో అమరుడయ్యారు. దీంతో దాదాపు 15 నెలల రేఖ సింగ్ వైవాహిక జీవితం అంధకారంలో పడింది. భర్త నుంచి స్ఫూర్తి పొందిన ఆమె భారత సైన్యంలో చేరాలని గట్టిగా నిర్ణయించుకున్నారు. దేశభక్తితో పట్టుదలగా మళ్ళీ మళ్లీ ప్రయత్నించి భారత సైన్యంలో లెఫ్టినెంట్‌గా ఎంపికయ్యారు. లెఫ్టినెంట్ ర్యాంక్ శిక్షణ మే 28 నుంచి చెన్నైలో ప్రారంభమవుతుంది. లాన్స్ నాయక్ దీపక్ సింగ్‌ను మరణానంతరం వీర చక్ర పురస్కారంతో భారత ప్రభుత్వం గౌరవించింది. రేఖ సింగ్ మీడియాతో మాట్లాడుతూ, తన భర్త అమరుడైనందుకు తాను తీవ్ర శోకంలో మునిగిపోయానని చెప్పారు. ఆ విచారంతోపాటు దేశభక్తి భావాల కారణంగా తాను భారత సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసి, సైన్యంలో చేరేందుకు నోయిడాలో శిక్షణ పొందానని తెలిపారు. అయితే సైన్యంలో చేరేందుకు ప్రవేశ పరీక్షకు తయారవడం అంత తేలికైన విషయం కాదన్నారు. ఫిజికల్ ట్రైనింగ్ పొందినప్పటికీ, మొదటి ప్రయత్నంలో తాను విఫలమయ్యానని చెప్పారు. అయితే పట్టు వదలకుండా రెండోసారి ప్రయత్నించి, విజయం సాధించానని, లెఫ్టినెంట్ ర్యాంకుకు ఎంపికయ్యానని చెప్పారు. లాన్స్ నాయక్ దీపక్ సింగ్ బిహార్ రెజిమెంట్ 16వ బెటాలియన్‌లో పని చేశారు. ఆయన ప్రదర్శించిన ధైర్య, సాహసాలకు గుర్తింపుగా ఆయన మరణానంతరం వీర చక్ర పురస్కారాన్ని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రదానం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)