జేడీయూలో తిరుగుబాటు ?

Telugu Lo Computer
0


72 గంటలు మాత్రం జేడీయూ ఎమ్మెల్యేలు పాట్నా నుంచి బయటకు వెళ్లొద్దని నితీశ్ కుమార్ హుకుం జారీ చేశారు. రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో నితీశ్ కుమార్ జారీ చేసిన ఆదేశాలకు ప్రాధాన్యం ఏర్పడింది. బీహార్ రాజకీయాల్లో కీలక మార్పులు సంభవించబోతున్నాయా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కుల గణన జరుపాలన్న డిమాండ్‌పై బీహార్ సీఎం నితీశ్, ప్రతిపక్ష ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఏకాభిప్రాయానికి వచ్చారని సమాచారం. ఇందుకోసం 27న అఖిలపక్ష భేటీ నిర్వహించబోతున్నారు. మరోవైపు, జేడీయూలో తిరుగుబాటు రానున్నదన్న వదంతులు వినిపిస్తున్నాయి. కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్‌ను మళ్లీ రాజ్యసభకు పంపడానికి నితీశ్‌కుమార్ సుముఖంగా లేరని సమాచారం. రాజ్యసభ సీటు తిరిగి పొందే అవకాశాలను ఆర్సీపీ సింగ్ వదులుకునేందుకు సిద్ధంగా లేరని తెలిసింది. ఈ పరిస్థితుల్లో జేడీయూలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. ఒకవేళ ఆర్సీపీ సింగ్ తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధ పడితే.. జేడీయూ చీలిపోవడం ఖాయంగా కనిపిస్తున్నది. కొందరు ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకునేందుకు ఆర్సీపీ సింగ్ ప్రయత్నిస్తున్నారు. బీహార్ సీఎం నితీశ్ కుమార్ మంగళవారం రాజ్‌గిర్‌కు వెళ్లనున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. సీఎం నితీశ్.. రాజ్‌గిర్ టూర్‌కెళ్లినప్పుడల్లా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు చోటుచేసుకున్నాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. 2017లో ఆర్జేడీ-కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహా కూటమికి తిలోదకాలిచ్చేందుకు కొన్ని రోజుల ముందు రాజ్‌గిర్ పట్టణానికి నితీశ్ కుమార్ వెళ్లారు. రాజ్‌గిర్ నుంచి తిరిగొచ్చాక మహా కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు స్వయంగా నితీశ్ కుమార్ చెప్పిన సంగతి తెలిసిందే.


Post a Comment

0Comments

Post a Comment (0)