గుడి పునర్నిర్మాణం కోసం తవ్వకాల్లో బయటపడ్డ శివలింగం, నాణేలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా రెంటచింతల మండలం మంచికల్లులో పురాతన నాగమయ్య ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. ఆ ఆలయాన్ని పునర్నిర్మించాలని గ్రామస్థులు నిర్ణయించారు. తాజాగా అందుకు సంబంధించిన పనులు ప్రారంభించారు. ప్రస్తుతం ఉన్న ఆలయ శిథిలాలను తొలగిస్తున్నారు. దశబంధు కాలువకు, పంటపొలాలకు మధ్యనున్న ఆలయాన్ని శనివారం తొలగిస్తున్న సమయంలో 1876 నాటి శివలింగం, ఆ కాలం నాటి నాణేలు బయటపడ్డాయి. ప్రధాన ఆలయంలో ఐదు అడుగుల లోతు మేర తవ్వకాలు జరిపారు. ఐదడుగుల లోతులో శివలింగం బయటపడింది. శివలింగంతో పాటు ఆకాలం నాటి నాణేలు బయట పడ్డాయి. 150 ఏళ్ళ క్రితమే ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి. అయితే శివలింగం చెక్కు చెదరలేదు. నాణేలు తుప్పు పట్టి ఉన్నాయి. గ్రామస్థులు భక్తిశ్రద్దలతో ఆ శివలింగానికి జలాలతో అభిషేకం చేసి పూజలు చేశారు. అప్పట్లో యజ్ఞయాగాదులు చేసి పూర్వికులు ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటారని, ఇది శక్తివంతమైనదని స్థానికులు భావిస్తున్నారు. శివలింగాన్ని, నాణేలను స్థానికంగా ఉన్న మరో ఆలయానికి తరలించారు. పురాతన శివలింగం బయటపడిందన్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. ఈ వార్త తెలిసిన వెంటనే ఆ లింగాన్ని చూసేందుకు స్థానికులు, భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు.


Post a Comment

0Comments

Post a Comment (0)