సివిల్ జడ్జిగా ఎంపికైన కూరగాయల విక్రేత కూతురు!

Telugu Lo Computer
0


మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో కూరగాయలు అమ్ముతూ పొట్టపోసుకునే వ్యక్తి కూతురు అంకితా నాగర్‌ (29) సివిల్ జడ్జిగా ఎంపికై అందరి మన్ననలూ అందుకుంది. మూడుసార్లు రిక్రూట్‌మెంట్ పరీక్షలో ప్రతికూల ఫలితం ఎదురైనా పట్టుదలతో  నాలుగోసారి పరీక్షను క్లియర్ చేసి న్యాయమూర్తిగా ఎంపికైంది. జడ్జిగా ఎంపికైన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనని ఆమె అన్నారు. అంకిత తండ్రి అశోక్ నాగర్‌ ఇండోర్‌లోని ముసఖేది ప్రాంతంలో కూరగాయలు విక్రయిస్తుంటారు. పరీక్షల కోసం ప్రిపరేషన్ పూర్తయిన తర్వాత తాను తండ్రి పనుల్లో సాయం చేస్తానని అంకిత చెబుతోంది. న్యాయ విద్యలో డిగ్రీ చేసిన తర్వాత తనకు జడ్జి కావాలని అనుకున్నానని మాస్టర్స్ డిగ్రీ సైతం పూర్తి చేశానని చెప్పింది. మూడు సార్లు లక్ష్య సాధనలో విఫలమైనా విడిచిపెట్టకుండా తన కల నెరవేర్చుకున్నానని తెలిపింది. సివిల్ జడ్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తన కోర్టుకు వచ్చిన ప్రతిఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తానని పేర్కొంది. జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురైనా తమ కూతురు ధైర్యం కోల్పోకుండా నిలిచిన తీరు ప్రతి యువతికీ ఉదాహరణగా నిలుస్తుందని అంకిత తండ్రి అశోక్ నాగర్ చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)