మత ప్రదేశాల్లో లౌడ్‌స్పీకర్లకు అనుమతి తప్పనిసరి

Telugu Lo Computer
0


మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే లేవనెత్తిన లౌడ్‌స్పీకర్ల అంశానికి ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం ఎట్టకేలకు తలొగ్గింది. మసీదులు గుడులు సహా ఇతర మతపరమైన ప్రదేశాల్లో ప్రభుత్వ అనుమతి ఉంటేనే లౌడ్‌స్పీకర్లు పెట్టుకోవాలని మహారాష్ట్ర హోంమంత్రి దిలిప్ వాస్లే పాటిల్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయమై ఆయన ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేతో ప్రత్యేక సమావేశమయ్యారు. అనంతరం రాష్ట్ర డీజీపీతో సమావేశమై తాజా ఆదేశాలు జారీ చేశారు. వచ్చే నెల 3వ తేదీ లోపు మసీదుల్లో లౌడ్‌స్పీకర్లు తొలగించకపోతే, మసీదుల బయట తాము బిగ్గరగా వినిపించే హనుమాన్‌ చాలీసాను ముస్లింలు వినాల్సి వస్తుందని ఆదివారం మరోసారి పునరుద్ఘాటించారు రాజ్ థాకరే. ఇందుకు హిందూ సోదరులందరూ సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. అయితే లౌడ్‌స్పీకర్ల ద్వారా అజాన్‌కు పిలుపు ఇవ్వడం మతపరమైన అంశం కాదని, అది సామాజిక సమస్య అని రాజ్ థాకరే పేర్కొనడం విశేషం. 'న్యాయవ్యవస్థకన్నా తమ మతమే గొప్పదని ముస్లింలు భావిస్తే, దెబ్బకుదెబ్బ తీస్తాం. అయితే ముస్లింలకు, వారి ప్రార్థనలకు మేం వ్యతిరేకం కాదు. శాంతికి భంగం కలగాలని మేమెప్పుడూ కోరుకోం కూడా'' అని రాజ్‌ఠాక్రే అన్నారు. హిందూ ఊరేగింపులపై దాడులు కొనసాగితే తాము కూడా ఆయుధాలు పట్టుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాగా శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యలకు తాను స్పందించనని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)