ఆన్‌లైన్‌లో సర్కారు వారి దుకాణం !

Telugu Lo Computer
0


సర్కారు వారి దుకాణం ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. కొనుగోలుదార్లకు, అమ్మకందార్లకు అనుసంధానంగా ఉండే బాధ్యతను కేంద్రం తీసుకుంది. ఓఎన్ డిసి పేరుతో ఆన్‌లైన్‌ పోర్టల్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ రంగంలో పాతుకుపోయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌కు గట్టిపోటీ ఇచ్చేందుకు సిద్ధమైంది. పైలట్ ప్రాజెక్ట్‌గా ఢిల్లీ, బెంగళూరు, భోపాల్, కోయంబత్తూర్‌లో ప్రారంభించింది. అయితే ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌కు ఓఎన్ డిసికి ఉన్న ప్రధానమైన తేడా ఆయా సంస్థలు పేరుపొందిన సూపర్ మార్కెట్‌లు లేదా పేరుపొందిన కంపెనీల వస్తువుల అమ్మకానికే ప్రాధాన్యం ఇస్తాయి. అలాగే భారీ స్థాయిలో వ్యాపారం ప్రారంభించిన కంపెనీల వస్తువులకే పెద్దపీట వేస్తాయి. ఈ వ్యవస్థలో సమూల మార్పులు తేనుంది ప్రభుత్వ ఆధ్వర్యంలో మొదలుకానున్న ఓఎన్ డిసి. మన వీధి చివరనున్న కిరాణా కొట్టు కూడా ఓఎన్ డిసి వేదికగా అమ్మకాలు సాగించవచ్చు. వినియోగదారులతో మమేకం కావొచ్చు. అలాగని సూపర్, హైపర్ మార్కెట్లకు ఇందులో చోటులేదని అనుకోవద్దు. చిన్న, పెద్ద అన్నతేడాలేకుండా అన్ని షాపులూ, అందరి వినియోగదారులూ ఓఎన్ డిసిలో అనుకున్నవి అమ్మొచ్చు, కావాల్సినవి కొనుక్కోవచ్చు. కిరాణాకొట్లకు, చిన్నస్థాయి అమ్మకందార్లకు స్వర్గధామంలా ఓఎన్ డిసి మారనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ వినూత్న ఆలోచన వెనక ఉంది, దాన్ని కార్యరూపం దాల్చేలా చేసింది నందన్ నీలేకని. ఆధార్ వ్యవస్థతో దేశపౌరులందరికీ ఓ అధికారిక గుర్తింపు తీసుకొచ్చి అన్నింటికీ ఆధార్ ఆధారమయ్యేలా చేసిన నీలేకని ఈ కామర్స్ రంగం రూపురేఖలను, కిరాణాకొట్ల స్థితిగతిని మార్చేందుకు, డిజిటల్ కామర్స్‌ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఓఎన్ డిసిని రూపొందించారు. చిన్న చిన్న దుకాణాల నుంచి భారీ స్థాయి సూపర్ మార్కెట్ల దాకా ఎవరైనా అమ్మకాలు సాగించే వీలుండడంతో వినియోగదారులకు అనేకరకాల వస్తువులు అందుబాటులోకొస్తాయి. మార్కెట్‌లో ఉన్న అనేక రకాలను పరిశీలించి అత్యుత్తమమైనది ఎంపిక చేసుకునే అవకాశముంటుంది. 150 మంది అమ్మకం దార్లతో ఐదు నగరాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమవుతున్న ఆన్‌లైన్ నెట్‌వర్కింగ్ డిజిటల్ కామర్స్ పోర్టల్ 3 కోట్ల మంది అమ్మకందార్లకు ఓఎన్ డిసిని వేదికగా మార్చాలని భావిస్తోంది. ఆరు నెలల్లో 100 నగరాలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కామర్స్ రంగంలో సమూల మార్పులు తెచ్చే అవకాశముందని భావిస్తున్నప్పటికీ ఓఎన్ డిసిపై మార్కెట్ నిపుణులు కొందరు అనేక అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. వస్తువు ఆలస్యంగా చేరడం, డ్యామేజ్ వంటివి జరగడం వంటివాటికి అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటివి బాధ్యత వహిస్తాయని, మరి చిన్న స్థాయి అమ్మకందార్లు ఈ సమస్యలను ఎలా పరిష్కరిస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. అలాగే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ భారీ కంపెనీలతో టై అప్ అయి..అనేక వస్తువులను డిస్కౌంట్‌పై అందిస్తున్నాయని, బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే ధరలు 10 నుంచి 12శాతం తక్కువకు అందిస్తున్నాయని, దానివల్ల కలిగే నష్టాలను ఆయా సంస్థలే భరిస్తున్నాయని చెబుతున్నారు. ఈ నష్టాలను భరించే శక్తి చిన్న అమ్మకందార్లకు ఉండదని అంటున్నారు. . క్యాన్సిలేషన్, రీ ఫండ్ గైడ్‌లైన్స్ పకడ్బందీగా ఉండాలని సూచిస్తున్నారు. ఓఎన్ డిసి ఉద్దేశం మంచిదయినా, కార్యాచరణ చాలా కష్టమన్నది నిపుణుల అభిప్రాయం. ఓఎన్ డిసి ఈక్విటీకి వివిధ బ్యాంకులు 255 కోట్లు వెచ్చించాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, కొటక్ మహీంద్ర బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)