ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా షాబాజ్ షరీఫ్

Telugu Lo Computer
0


పాకిస్థాన్ ప్రతిపక్షాలు తమ ఉమ్మడి ప్రధాన మంత్రి అభ్యర్థిగా పీఎంఎల్-ఎన్ నేత షాబాజ్ షరీఫ్‌ను ఆదివారం ప్రకటించాయి. ఈ పదవికి ఎన్నిక  సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు నేషనల్ అసెంబ్లీలో జరుగుతుంది. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌లో ఓడిపోవడంతో ఇమ్రాన్ ఖాన్ పదవీచ్యుతుడైన సంగతి తెలిసిందే. తనను ప్రతిపక్షాలు ప్రధాన మంత్రి పదవికి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత షెహబాజ్ షరీఫ్ ట్విటర్ వేదికగా అందరికీ ధన్యవాదాలు తెలిపారు. మీడియా, పౌర సమాజం, న్యాయవాదులు, నవాజ్ షరీఫ్, అసిఫ్ జర్దారీ, మౌలానా ఫజలుర్ రెహమాన్, బిలావల్ భుట్టో, ఖలీద్ మక్బూల్, ఖలీద్ మాగ్సి, మోసిన్ దావర్, అలీ వజీర్, అమీర్ హైదర్ హోతీ, రాజ్యాంగానికి మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్‌ సోదరుడు షాబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు. షాబాజ్  షరీఫ్ కోసం పీఎంఎల్-ఎన్ పార్టీ చాలా నామినేషన్ పత్రాలను నేషనల్ అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయనకు మద్దతుగా ఇతర ప్రతిపక్ష పార్టీలు కూడా నామినేషన్లను దాఖలు చేయడం కోసం అదనంగా నామినేషన్ పత్రాలను తీసుకున్నట్లు సమాచారం. షాబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవజ్ఞుడు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. ప్రస్తుతం పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)