చచ్చిన పార్టీని బ్రతికించేందుకే ఎంఎన్‌ఎస్‌ ప్రయత్నాలు

Telugu Lo Computer
0


చచ్చిన పార్టీని బ్రతికించేందుకే మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్‌ఎస్‌) ప్రయత్నిస్తున్నదని శివసేన నేత, మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే విమర్శించారు. ముంబైలోని శివసేన ప్రధాన కార్యాలయం వద్ద ఎంఎన్‌ఎస్‌ నేత హనుమాన్‌ చాలీసాను మైక్‌లో ప్లే చేయడంపై ఆయన ఈ మేరకు స్పందించారు. తమ పార్టీ హిందుత్వం గురించి అందరికీ తెలిసిందేనని అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు వాగ్దానం చేసిన వాటిని తాము నెరవేస్తున్నామని చెప్పారు. మసీదుల్లో అజాన్‌ను అనుమతించడంపై నిరసనగా శ్రీరామ నవమి సందర్భంగా ముంబైలోని శివసేన భవన్‌ వద్ద హనుమాన్‌ చాలీసా ప్లే చేస్తామని ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎస్‌ నాయకుడు యశ్వంత్ కిల్లెదార్ ఆదివారం ఒక ట్యాక్సీపై మైకు ఏర్పాటు చేసి శివసేన ప్రధాన కార్యాలయం సమీపంలో హనుమాన్‌ చాలీసా ప్లే చేశాడు. ఈ విషయం తెలిసిన పోలీసులు యశ్వంత్‌తోపాటు ట్యాక్సీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే దీనిపై ఎలాంటి కేసు నమోదు కాలేదు. మరోవైపు మసీదుల్లో ఏర్పాటు చేసిన మైక్‌లను తొలగించాలని ఎంఎన్‌ఎస్‌ చీఫ్‌ రాజ్‌ ఠాక్రే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో మసీదుల వద్ద మైకుల్లో హనుమాస్ చాలీసా ప్లే చేస్తామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఎంఎన్‌ఎస్‌, బీజేపీపై శివసేన మండిపడింది. బీజేపీ ఉద్దేశపూర్వకంగా ఎంఎన్‌ఎస్‌ను రెచ్చగొడుతున్నదని, ప్రజల్లో భయాందోళన కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)