కీలక సూత్రధారి అరెస్ట్

Telugu Lo Computer
0

 

తెలుగు రాష్ట్రాల్లో ఏపీ మహేశ్‌బ్యాంక్‌ సైబర్ దోపిడీ కేసు సంచలనం కలిగించింది. ఈ కేసులో పోలీసులు ఎట్టకేలకు పురోగతి సాధించారు. ఇతర కేసుల కంటే ఈ కేసు దర్యాప్తునకు భారీగా ఖర్చయిందని స్వయంగా హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. సైబర్ స్కాంకి సంబంధించి ఓ కీలక సూత్రధారిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా సైబర్ దోపిడీ చేయాలని పథకం రచించిన ఢిల్లీలో ఉంటున్న నైజీరియన్ చక్స్ హ్యాకర్ల ఆదేశాల మేరకు రూ.12.48 కోట్లు కాజేసేందుకు ప్లాన్ రెడీ చేశాడు. ఇందుకోసం ఇద్దరు నైజీరియన్లు స్టీఫెన్ ఓర్జీ, సీ ఆప్టిల్‌కు బాధ్యతలు అప్పగించాడు. అంతా సిద్ధమయ్యాక ఈ ఏడాది జనవరి 22, 23 తేదీల్లో స్టీఫెన్ ఓర్జీ, ఆప్టిల్ ద్వారా రూ.12.48 కోట్లు బదిలీ చేయించాడు. ఆ తర్వాత చక్స్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. స్టీఫెన్ ఓర్జీని నాలుగు రోజుల క్రితం పోలీసులు అరెస్ట్ చేశారు. మహేశ్ బ్యాంకు నుంచి డబ్బులు కొట్టేసే ప్లాన్‌పై పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. సైబర్ దోపిడీ కోసం మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిచే బాధ్యతను చక్స్, తనకు పరిచయం ఉన్న ఢిల్లీకి చెందిన అక్తర్‌కు అప్పగించానని చెప్పుకొచ్చాడు. ఇందులో భాగంగా బియ్యం వ్యాపారం నిమిత్తం ఢిల్లీకి వచ్చే కర్నూలు వాసి రసూల్‌తో అక్తర్ నాలుగు నెలల క్రితం మాట్లాడి మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిస్తే కమీషన్ ఇస్తామని ఆశ చూపాడు. ఈ మేరకు డిసెంబరులో రసూల్ తన స్నేహితుడైన కూకట్‌పల్లిలో ఉంటున్న కోలిశెట్టి సంపత్ కుమార్‌తో కలిసి మహేశ్ బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేశాడు. జనవరి 22న రాత్రి సంపత్, రసూల్‌ కలిసి హైదరాబాద్‌లో స్టీఫెన్ ఓర్జీ, ఆప్టిల్‌ను కలుసుకుని స్కాంకి పథక రచన చేశారు. కారులోనే మహేశ్ బ్యాంకులోని సంపత్ ఖాతాకు రూ.99 లక్షలను ఓర్జీ బదిలీ చేశాడు. మరో బ్యాంకులో సంపత్ ఖాతాకు కమీషన్ కింద రూ. 5 లక్షలు బదిలీ చేశాడు. ఆంధ్రప్రదేశ్ లోని విజయనగరం జిల్లా పార్వతీపురంలో ప్రైవేటు ఉద్యోగి అలెక్స్ పాండీని లైన్‌లో పెట్టిన చక్స్ అతడి ద్వారా హైదరాబాద్‌లో శాన్విక ఎంటర్‌ప్రైజెస్ నిర్వహిస్తున్న మేడారపు నవీన్‌తో మహేశ్ బ్యాంకులో ఖాతా తెరిపించాడు. జనవరి 22, 23 తేదీల్లో రూ.4 కోట్లను నవీన్ ఖాతాకు బదిలీ చేసిన చక్స్ అనంతరం ఆ ఖాతా నుంచి ఢిల్లీ యూపీ, ఈశాన్య రాష్ట్రాల్లోని బ్యాంకు ఖాతాలకు ఆ సొమ్మును బదిలీ చేశాడు. కొన్ని లావాదేవీలు ఫెయిల్ కావడంతో కొంత సొమ్ము కేటుగాళ్ళకు అందకుండా పోయింది. ప్రధాన నిందితుడు దొరకడంతో కేసులో మరిన్ని అంశాలు బయటకు వస్తాయని భావిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)