సోనియా తో మరోసారి భేటీ అయిన ప్రశాంత్ కిషోర్

Telugu Lo Computer
0


కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి వచ్చే ఎన్నికలకు సన్నద్ధం అయ్యేలా అధినేత్రి సోనియా గాంధీ పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కలిసి పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు కాంగ్రెస్ అధిష్టానం ప్రణాళికలు వేస్తుంది.  ప్రశాంత్ కిషోర్ సైతం కాంగ్రెస్ పార్టీలో చేరే ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈనేపథ్యంలోనే సోనియా గాంధీ, ప్రశాంత్ కిషోర్ మూడు రోజుల వ్యవధిలో రెండుసార్లు భేటీ అవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గత శనివారం  కాంగ్రెస్ సినియర్ నాయకులతో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్. ఆ సమావేశంలో 2024 సార్వత్రిక ఎన్నికలపై తాను రచించిన ప్రణాళికలను పార్టీ నేతలతో పంచుకున్నారు. అదే సమయంలో తాను కాంగ్రెస్ లో చేరే అంశాన్ని కూడా సీనియర్ నాయకుల వద్ద ప్రస్తావించారు ప్రశాంత్ కిషోర్. సోమవారం నాడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఆధ్వర్యంలో మరోసారి పార్టీ సినియర్ క్యాడర్ తో భేటీ అయిన ప్రశాంత్ కిషోర్ ఈ ఏడాది చివరలో జరగనున్న గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలకు వ్యూహరచన చేసినట్లు తెలిసింది. ఢిల్లీలో సోనియా నివాసంలో జరిగిన ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కెసి వేణుగోపాల్, అంబికా సోని, ప్రియాంక గాంధీ వాద్రా, ముకుల్ వాస్నిక్, జైరాం రమేష్, పి చిదంబరం, రణదీప్ సింగ్ సూర్జేవాలా తదితరులు హాజరయ్యారు. నాలుగు గంటలకు పైగా సాగిన ఈ సమావేశంలో రానున్న ఎన్నికల వ్యూహంలోని వివిధ కోణాలపై నేతలు చర్చించారు. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆచితూచి వ్యవహరించాలని చెప్పుకొచ్చిన ప్రశాంత్ కిషోర్, ముందుగా పార్టీకి బలం ఉన్న నియోజకవర్గాల్లోనే అభ్యర్థులను బరిలో దించాలని ప్రతిపాదించారు. తద్వారా ఆయా అభ్యర్థులు గెలిస్తే ఆ విజయం తాలూకు ప్రభావం ఇతర ప్రాంతాల్లోనూ కనిపిస్తుందని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా 370 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఏకాకిగానే బరిలో దిగడం సహా..ప్రశాంత్ కిషోర్ ప్రతిపాదించిన పలు అంశాలపై పార్టీ నేతలు చర్చించి నిర్ణయం తీసుకోవాలని అధిష్టానం ఈ నెలాఖరు వరకు సమయం ఇచ్చింది.

Post a Comment

0Comments

Post a Comment (0)