రాజ్ థాకరేను కలిసిన నితిన్ గడ్కరీ

Telugu Lo Computer
0


కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేను కలిశారు. సోమవారం ఉదయం ముంబై చేరుకున్న నితిన్ గడ్కరీ రాజ్ థాకరే నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అనంతరం రాజ్ థాకరే నివాసం వద్ద నితిన్ గడ్కరీ మీడియాతో మాట్లాడుతూ తాను స్నేహ పూర్వకంగానే రాజ్ థాకరేను కలుసుకున్నట్టు పేర్కొన్నారు. తమ ఇరువురి కుటుంబాల మధ్య 30 ఏళ్లుగా సాన్నిహిత్యం ఉందన్న గడ్కరీ..రాజ్ థాకరే తల్లిని కలుసుకుని ఆరోగ్యంపై ఆరా తీసినట్టు తెలిపారు. ఇటీవల రాజ్ థాకరే ముంబైలో కొత్త ఇల్లు నిర్మించుకున్నారని..వారి ఆహ్వానం మేరకే ఇక్కడికి వచ్చినట్లు గడ్కరీ వివరించారు. తమ భేటీలో ఎటువంటి రాజకీయ అంశాలు చర్చించలేదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో మసీదులపై లౌడ్ స్పీకర్లు తొలగించాలని, లేని పక్షంలో మసీదుల ఎదుట లౌడ్ స్పీకర్లు పెట్టి హనుమాన్ చాలీసా వినిపిస్తామంటూ శనివారం రాజ్ థాకరే సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే స్పందించి..మసీదులపై మైక్ లను, లౌడ్ స్పీకర్లను తొలగించాలని రాజ్ థాకరే డిమాండ్ చేశారు. అనంతరం తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన రాజ్ థాకరే..నమాజ్, ప్రార్ధనలను తాను వ్యతిరేకించడంలేదని..కేవలం మసీదులపై మైక్ లను తొలగించాలన్నదే తమ డిమాండ్ అంటూ వివరించారు. అనేక మతాలు, ఆచారాలను పాటిస్తున్న భారతదేశంలో ఏ మతం వారు ఆచరించని విధంగా మసీదులపై మైక్ లు పెట్టాల్సిన అవసరం ఏంటంటూ రాజ్ థాకరే ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై శివసేన నేతలు సైతం విమర్శలు గుప్పించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)