క్యాన్సర్‌ గుర్తింపు, చికిత్సలో ముందడుగు

Telugu Lo Computer
0


క్యాన్సర్‌కు కారణమయ్యే 58 జన్యు సంకేతాలను శాస్త్రవేత్తలు కొత్తగా గుర్తించారు. పొగతాగడం, అతినీలలోహిత కిరణాలు తదితర కారణాల వల్ల శరీరంలో జరిగే జన్యుమార్పులకు సంబంధించి ఇప్పటివరకు 51 జన్యు సంకేతాలు మాత్రమే శాస్త్రవేత్తలకు తెలుసు. అయితే, మనకు తెలియని అత్యంత కీలకమైన క్యాన్సర్‌ కారకాలు మరెన్నో ఉన్నాయని తాజా పరిశోధన ఫలితాలలో వెల్లడైంది.ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం 12వేల మందికి పైగా క్యాన్సర్‌ రోగులపై అధ్యయనం చేసింది. వారి క్యాన్సర్‌ కణితిల్లోని జన్యు మార్పులను విశ్లేషించింది. క్యాన్సర్‌కు కారణమవుతున్న 58 జన్యు సంకేతాలను గుర్తించింది. ఈ వివరాలను 'సైన్స్‌ జర్నల్‌’లో ప్రచురించారు. ఈ సంకేతాల అధారంగా క్యాన్సర్‌ కారకాలను గుర్తించడంతో పాటు కొత్త చికిత్స విధానాలను అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. క్యాన్సర్‌ కారక జన్యు మార్పులపై అధ్యయనానికి ఈ ఫలితాలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. క్యాన్సర్‌ రహిత ప్రపంచసాధనకు తాజా ఫలితాలు కీలకమన్నారు. క్యాన్సర్‌కు అత్యాధునిక చికిత్సా విధానాలు వచ్చాయి. రోగులు బతికే అవకాశాలు పెరిగాయి. అయితే, కొంత మందిలో చికిత్స తర్వాత కూడా మళ్లీ క్యాన్సర్‌ కణితిలు పెరిగే ప్రమాదం ఉంది. చికిత్స అనంతరం తిరిగి కణితులు ఏర్పడే అవకాశాలను అత్యంత కచ్చితంగా అంచనా వేసేలా ఇంగ్లండ్‌ శాస్త్రవేత్తలు, వైద్యులు ఆక్టపస్‌-ఏఐ అనే పరికరాన్ని తయారు చేశారు. ఇది కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తుంది. క్యాన్సర్‌ రోగులపై నిఘాకు, క్యాన్సర్‌ మరణాలను తగ్గించేందుకు, సకాలంలో చికిత్స అందించేందుకు ఈ పరికరం చాలా దోహదపడుతుందని వైద్యులు భావిస్తున్నారు. ఎక్కువ కాలం స్థూలకాయంతో బాధపడే మహిళల్లో గర్భాశయ క్యాన్సర్‌ వచ్చే ప్రమాదం రెండింతలు ఉంటుందని తాజా అధ్యయనంలో తేలింది. ఇంగ్లండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిస్టల్‌ శాస్త్రవేత్తలు ఆస్ట్రేలియా, బెల్జియం, జర్మనీ, పోలాండ్‌, స్వీడన్‌, యూకే, అమెరికాలోని దాదాపు 1,20,000 మంది స్థూలకాయులను పరీక్షించగా, అందులో 13 వేల మంది గర్భాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్నట్టు తెలిసింది. హార్మోన్ల స్థాయిల్లో తేడాలు వచ్చి ఈ సమస్య వస్తున్నదని, దీన్నిబట్టి స్థూలకాయానికి, క్యాన్సర్‌కు సంబంధం ఉన్నట్టు కనుగొన్నట్టు పరిశోధకులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)