కర్ణాటక సీఎం మార్పుపై తర్జనభర్జనలు

Telugu Lo Computer
0



కర్ణాటకపై తమ పట్టుసడలిపోకుండా కమలనాథులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భాజపాకు దక్షిణాదిలో కర్ణాటక ముఖద్వారంగా ఉంది. నాలుగుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్నా ఇప్పటి వరకు పూర్తి స్థాయి ఆధిక్యం రాలేదు. 'ఆపరేషన్‌ కమల'తో ఒకసారి తమ అధికార అవధిని పూర్తి చేసుకోగలిగింది. నేడు కూడా కాంగ్రెస్‌, జనతాదళ్‌ నుంచి వచ్చి, భాజపా సీటుపై పోటీ చేసి గెల్చిన నాయకులతోనే ప్రభుత్వం మనుగడ సాగిస్తోంది. ఈసారి మిషన్‌ 150 నినాదంతో బరిలో దిగుతామని యడియూరప్ప ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆయన వయసును సాకుగా చూపి ముఖ్యమంత్రి గద్దె నుంచి పక్కకు తప్పించారు. యడియూరప్పకు సన్నిహితంగా ఉన్న బసవరాజ బొమ్మైకు పట్టం కట్టారు. రెండు, మూడు నెలల్లోనే బొమ్మైను మార్చుతారని తొలుత ప్రచారం జరిగింది. పాలనలో ఎలాంటి వివాదాలు, విపక్షాల నుంచి ఆరోపణలు లేకుండా ఎనిమిది నెలలు పూర్తి చేశారు. ఈసారి ఎన్నికల్లో పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలంటే ముఖ్యమంత్రిని, కొందరు మంత్రులను మార్చాలంటూ సంఘ పరివార్‌ నాయకులు ప్రధాని మోదీ, పార్టీ అధ్యక్షుడు నడ్డా, హోం మంత్రి అమిత్‌ షాకు సిఫార్సు చేశారు. మంత్రివర్గంలో ఖాళీగా ఉన్న ఐదు స్థానాలను భర్తీ చేసేందుకు జాతీయ నాయకులు మీనమేషాల్ని లెక్కిస్తూ వచ్చారు. ఏ కారణం లేకుండా ముఖ్యమంత్రిని మార్చడం సరికాదని కొందరు నాయకులు ఇప్పటికే జాతీయ నాయకులకు సూచించారు. మంత్రివర్గం విస్తరణ, మార్పులు, చేర్పులపై చర్చించేందుకు జె.పి.నడ్డా, అమిత్‌ షా, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులు దత్తాత్రేయ హొసబాళె, అరుణ్‌ కుమార్‌లు సోమ, మంగళవారాల్లో హస్తినలో సమావేశం కానున్నారు. బుధ, గురువారాల్లో బొమ్మైను దిల్లీకి పిలిపించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. తనకు పదవిపై మోజు లేదని, సీఎం అంటే కామన్‌ మ్యాన్‌ అని చెబుతూ వచ్చిన ముఖ్యమంత్రి, ఇప్పుడు పాలనలో తన ముద్ర కనిపించేలా వివిధ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రిని తొలగించకుండా ఉప ముఖ్యమంత్రులుగా సమర్థులకు బాధ్యతలు అప్పగించాలని మరికొందరు నేతలు సిఫార్సు చేశారు. ఈ ఉత్కంఠకు నెలాఖరు నాటికి తెరపడుతుందని రాజకీయ నిపుణుల మదింపు.

Post a Comment

0Comments

Post a Comment (0)