చిప్ ల కొరత తో కార్ల సంస్థలపై తీవ్ర ప్రభావం

Telugu Lo Computer
0


కరోనా కారణంగా అంతర్జాతీయంగా ఏర్పడిన మైక్రో చిప్ ల కొరత ఇంకా కొనసాగుతుంది. దేశీయంగా చిప్ ల కొరత కార్ల తయారీ సంస్థలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. గత రెండున్నరేళ్లుగా నెలకొన్న కరోనా ప్రభావంతో ఇతర దేశాల నుంచి చిప్ ల దిగుమతి పాక్షికంగా నిలిచిపోయింది. లాక్ డౌన్ కారణంగా చిప్ తయారీ సంస్థలు పరిశ్రమలను మూసివేశాయి. అయితే ప్రస్తుత పరిస్థితులు కాస్త మెరుగుపడ్డా చిప్ ఉత్పత్తి మాత్రం సగటుగానే కొనసాగుతుంది. భారత్ లో చిప్ ల కొరత కారణంగా కార్ల తయారీ సంస్థలు పరిమితంగానే వాహనాలను తయారు చేస్తున్నాయి. అదే సమయంలో వినియోగదారుల నుంచి ఇబ్బడిముబ్బడిగా వస్తున్న కొత్త ఆర్డర్లతో డిమాండ్ అందుకోలేకపోతున్నాయి. భారత్ కార్ల తయారీ సంఘం సియామ్ అంచనా మేరకు.. గతేడాది ఫిబ్రవరిలో కార్ల సరఫరాలతో పోలిస్తే ఈ ఏడాది సరఫరాలో 23 శాతం క్షీణత కన్పిస్తుంది. గతేడాది కరోనా లాక్ డౌన్ అతిగా ప్రభావం చూపగా.. ఈ ఏడాది రష్యా యుక్రెయిన్ యుద్ధంతో పాటు.. దేశీయంగా ప్రభుత్వ నిబంధనలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపినట్లు సియామ్ వెల్లడించింది. కార్ల తయారీలో భారత ప్రభుత్వం తెచ్చిన నియంత్రణ పరమైన మార్పులకు తోడు.. అంతర్జాతీయంగా చిప్ ల ధరలు పెరగడంతో దేశీయంగా వాహన తయారీపై తీవ్ర ప్రభావం పడింది. కమర్షియల్ వాహనాలు మినహా ఇప్పటికే వేల సంఖ్యలో ప్యాసింజర్ వాహనాల ఆర్డర్లు నిలిచిపోయాయి. భారత్ లో చిప్ ల కొరతను అధిగమించేందుకు అటు కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇటు కార్ల తయారీ సంస్థలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇప్పటి వరకు చిప్ లను విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుండగా..ఇకపై దేశీయంగానే తయారు చేసుకునేలా.. చి తయారీ పరిశ్రమలు నెలకొల్పేందుకు ఔత్సాహిక వ్యాపారులు ముందుకు రావాలను కేంద్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. అయినప్పటికీ అవి కార్యరూపం దాల్చి.. పరిశ్రమను నెలకొల్పి..చిప్ తయారై బయటకు వచ్చేందుకు నెలల సమయం పడుతుంది. దీంతో ఈ సమస్య ఇప్పట్లో తీరేలా కనిపించడంలేదు.

Post a Comment

0Comments

Post a Comment (0)