గోవాలో హంగ్ ?

Telugu Lo Computer
0


గోవాలో మాత్రం ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు బీజేపీ 18 సీట్లు, కాంగ్రెస్ 12, ఆప్ 03, టీఎంసీ+04, ఇతరులు 03 స్థానాల్లో అధిక్యంలో కొనసాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 21 సీట్లు కైవసం చేసుకోవాల్సి ఉంటుంది. ఏ పార్టీకి మెజార్టీ రాదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అనుకున్నట్లుగానే.. మ్యాజిక్ ఫిగర్ కు దరిదాపులో నిలిచిపోయాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అలర్ట్ అయ్యాయి. తమ అభ్యర్థులను ఇతర పార్టీలు ఆకర్షించకుండా ఉండేందుకు క్యాంపు రాజకీయాలు షురూ చేశాయి. కాంగ్రెస్ అభ్యర్థులను రిసార్ట్ తరలించినట్లు సమాచారం.గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు సంపాదించినా.. ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయిన సంగతి తెలిసిందే. ఈ సారి కూడా అదే జరుగుతుందా ? అనే భయంలో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. దీంతో ఫలితాలు విడుదలవుతున్న కొద్దీ వారిలో టెన్షన్ మొదలైంది. అభ్యర్థులను తరలించడానికి ఉరుకులు పరుగులు పెడుతున్నారు. కాంగ్రెస్ క్యాంపు బాధ్యతలను ట్రబుల్ షూటర్ గా పేరొందిన డీకే శివకుమార్ కు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి బీజేపీయేతర పార్టీలను సంప్రదిస్తామని కాంగ్రెస్ నేతలు వెల్లడిస్తున్నారు. చిన్న పార్టీల నేతలు కీలకంగా మారారు. వారితో ఇప్పటి నుంచే సంప్రదింపులు జరుపుతున్నారు. కానీ.. బీజేపీ మాత్రం ధీమాగా ఉంది. బీజేపీనే మరోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోందని సీఎం ప్రమోద్ సావంత్ జోస్యం చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)