చిరుత పులితో రెండు గంటల పాటు గదిలోనే....!

Telugu Lo Computer
0

 

అస్సాంలోని టిన్సుకియా జిల్లా బోర్దుబీ గావ్ గ్రామానికి ఇటీవల ఒక చిరుత పులి వచ్చింది. చిరుత పులిని చూసేందుకు గ్రామస్తులు ఎగబడ్డారు. గ్రామస్తులు గట్టిగా కేకలు వేస్తుండడంతో కంగారుపడిన చిరుతపులి అక్కడి నుంచి బయటపడేందుకు ప్రయత్నించింది. ఈక్రమంలో చిరుతను చూసేందుకు రేణు మాఝి అనే 15 ఏళ్ల బాలిక కూడా తన స్నేహితులతో కలిసి ఒక ఇంటి వద్దకు చేరుకుంది. గ్రామస్తుల అరుపులకు భయపడిన చిరుత.. రేణు మాఝి ఉన్న ఇంటిలోకి ప్రవేశించింది. ఊహించని ఈ పరిణామంతో అక్కడే ఉన్న రేణు స్నేహితులు ఆ ఇంటిలో ఉన్న మూడు గదుల్లోకి వెళ్లి తల దాచుకున్నారు. ఇంతలో చిరుత మెల్లగా అక్కడి గదిలోకి ప్రవేశించింది. చిరుతను చూసి ఆ గదిలో ఉన్న యువతీ యువకులు బయటకు పరుగు తీశారు. వెళుతూ వెళుతూ గది తలుపు గట్టిగా గడిపెట్టి వెళ్లారు. అయితే అదే గదిలో ఉన్న రేణు మాఝి మాత్రం బయటకు వెళ్లలేక అక్కడే చిక్కుకుపోయింది. స్నేహితులను పిలిస్తే చిరుత వింటుందన్న భయంతో ఆ ప్రయత్నం చేయలేదు రేణు. తన చేతిలో సెల్ ఫోన్ ఉన్నా మాట్లాడే సాహసం చేయలేకపోయింది. చిరుత కంట పడకుండా మెల్లగా ఒక అల్మారాలోని సూట్ కేసును అడ్డుగా పెట్టుకుని క్షణం ఒక యుగంలా గడిపింది రేణు.  ఇంతలో రేణు స్నేహితులు ఫోన్ చేయగా.. మెల్లగా మాట్లాడి తాను గది లోపల ఉన్న విషయాన్నీ గ్రామస్తులకు తెలియజేసింది. బాలిక చిరుతతో సహా గదిలో చిక్కుకుందని గ్రహించిన గ్రామస్తులు.. గది పైకప్పును తొలగించి ఒక నిచ్చెనను గదిలోకి దించారు. అదే సమయంలో చిరుత ఆ నిచ్చెనను చూసింది. ఇది గ్రహించిన రేణు.. నిచ్చెనను అందుకునేలోగా చిరుత నోటికి చిక్కడం ఖాయం అనుకుని.. కొద్ది సేపు వేచి చూసింది. అలా రెండు గంటల అనంతరం చిరుత దృష్టి మరల్చడంతో ఒక్క ఉదుటున నిచ్చెనను అందుకున్న రేణు మాఝి గబగబా పైకి ఎగబాకింది. బ్రతుకు జీవుడా అనుకుంటూ అక్కడి నుంచి బయటపడింది. అనంతరం అటవీశాఖ అధికారులు వచ్చి చిరుతను బందించి సమీప అడవిలో వదిలేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)