దౌత్య విభాగం కృషి భేష్ : మోదీ

Telugu Lo Computer
0


భారత దేశ పురాతన వారసత్వ సంపదను, ప్రజల విశ్వాసాలను సూచించే పురాతన విగ్రహాలు అక్రమార్కుల చేతిలో పడి విదేశాలకు తరలివెళ్లాయని, అలా దొంగిలించబడిన విగ్రహాలను విజయవంతంగా తిరిగి తీసుకురావడానికి భారత దౌత్య విభాగం ఎంతో సున్నితంగా వ్యవహరిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. ఆదివారం “మన్ కీ బాత్” కార్యక్రమం ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ దొంగిలించబడ్డ విగ్రహాలు భారత్ కు తిరిగి రావడం దౌత్య పరంగా ఆయా దేశాలతో సంబంధాలు మరింత బలోపేతం చేసినట్లు తెలిపారు. గతంలో భారత్ లో దొంగిలించబడ్డ అనేక పురాతన విగ్రహాలను..అక్రమార్కులు అనేక దేశాలకు తరలించి సొమ్ము చేసుకున్నారని, వాటిని స్వదేశానికి తిరిగి తీసుకురావడం మనందరి బాధ్యత అని ప్రధాని అన్నారు. విగ్రహాలపై భారత దేశ ప్రజల విశ్వాసాన్ని గుర్తించిన అమెరికా, కెనడా, ఇటలీ, నెథర్లాండ్స్ వంటి దేశాలు తమ దేశంలోకి వచ్చిన పురాతన విగ్రహాలను తిరిగి అప్పజెప్పారని, ఇది ఆయా దేశాలతో మైత్రిని మరింత బలోపేతం చేసేదిగా ఉందని మోదీ వ్యాఖ్యానించారు. 2014 నుంచి వివిద దేశాల ప్రతినిధులు సుమారు 200కు పైగా పురాతన విగ్రహాలను భారత్ కు అప్పగించారు. వాటిలో 1000 సంవత్సరాల నాటి 'అవలోకేటేశ్వర పద్మపాణి' అనే విగ్రహం ఇటీవల ఇటలీ నుంచి మన దేశానికి తిరిగి వచ్చినట్లు మోదీ తెలిపారు. విలువకట్టలేని ఈ విగ్రహాన్ని వెయ్యేళ్ళ క్రితం బీహార్‌లోని కుందల్‌పూర్ దేవాలయంలో ప్రతిష్టించారని.. అయితే దాన్ని కొన్నేళ్ల క్రితం దుండగులు అపహరించారని మోడీ తెలిపారు. అదే విధంగా తమిళనాడులోని వెల్లూర్ లో 600 ఏళ్ల క్రితంగా చెప్పబడిన ఆంజనేయర్ హనుమాన్ విగ్రహం మన దేశం నుంచి ఆస్ట్రేలియాకు అక్రమంగా చేరుకుందని.. అయితే ఇటీవల జరిపిన దౌత్య చర్చల అనంతరం మన విగ్రహాన్ని వారు తిరిగి అప్పగించారని మోదీ పేర్కొన్నారు. విగ్రహ ఆరాధనను అనాదిగా పాటిస్తున్న హిందువులకు విగ్రహాలపై ఉన్న మనోవిశ్వాసాన్ని గౌరవించి ఆయా దేశాలు విగ్రహాలను తిరిగి ఇస్తున్నట్లు మోదీ వివరించారు. దొంగిలించబడిన ఈ విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు చోరీలకు పాల్పడిన వారిలో భయాందోళనలను కలిగించాయని ప్రధాని మోదీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)