డిసెంబర్‌లో హైదరాబాద్‌-ఇండోర్‌ కారిడార్‌

Telugu Lo Computer
0


హైదరాబాద్‌-ఇండోర్‌ కారిడార్‌ ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తికానున్నది. మధ్య భారతావనిని దక్షిణాదితో అనుసంధానిస్తూ జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్మిస్తున్న ఈ కారిడార్‌లో 800 కిలోమీటర్ల రహదారిని ఎక్స్‌ప్రెస్‌వేగా అభివృద్ధి చేస్తున్నారు. సరుకు రవాణాలో ఈ కారిడార్‌ చాలా కీలకమవుతుందని ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు చెప్తున్నారు. దాదాపు రూ.16 వేల కోట్లతో చేపట్టిన ఈ కారిడార్‌ నిర్మాణం శరవేగంగా జరుగుతున్నది. మన రాష్ట్రంలో సంగారెడ్డి జిల్లా కంది నుంచి జోగిపేట, పిట్లం మీదుగా సాగుతూ మీర్జాపూర్‌ వద్ద మహారాష్ట్రలోకి ప్రవేశించే ఈ రహదారి డెగ్లూర్‌, నాందేడ్‌, అకోలా మీదుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌ వరకు కొనసాగుతుంది. దీనిలో కంది నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు ఉన్న 136 కి.మీ. భాగాన్ని మూడు ప్యాకేజీలు (కంది-రామసానిపల్లి, రామసానిపల్లి-మంగుళూరు, మంగుళూరు-మహారాష్ట్ర సరిహద్దు)గా విభజించి నిర్మిస్తున్నారు. ఇందులో కంది నుంచి మంగుళూరు వరకు రెండు ప్యాకేజీల్లో ఉన్న 96 కి.మీ. నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మూడో ప్యాకేజీలోని 40 కి.మీ. పనులు డిసెంబర్‌ నాటికి పూర్తయి మొత్తం రహదారి అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఉపరితల రవాణశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఇటీవల వెల్లడించారు. ఈ రహదారి నిర్మాణంతో దక్షిణాది నుంచి మధ్య భారతావనికి సరుకు రవాణా వేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఇండోర్‌కు వెళ్లాలంటే నాగపూర్‌ మీదుగా (947 కి.మీ.) లేదా ఔరంగాబాద్‌ మీదుగా (974 కి.మీ.) వెళ్లాల్సి వస్తున్నది. హైదరాబాద్‌-ఇండోర్‌ కారిడార్‌ అందుబాటులోకి వస్తే ఈ దూరం దాదాపు 150 కి.మీ. తగ్గుతుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)