స్పెషల్ దర్శనం, సర్వదర్శనం కోటా పెంపు

Telugu Lo Computer
0


ఇప్పటికే ఆఫ్ లైన్లో సర్వదర్శనం టోకెన్లు విడుదల చేస్తున్న టీటీడీ తాజాగా ఈ నెలకు సంబంధించి అదనపు ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు విడుదల చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు రోజుకు 13వేల టోకెన్ల చొప్పున విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. ఈనెల 23న ఆన్ లైన్ ద్వారా ఈ టోకెన్లను జారీ చేస్తామని స్పష్టం చేసింది. భక్తులు ఆన్ లైన్ ద్వారానే ఈ టోకెన్లు పొందాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 24వ తేదీ నుంచి మార్చి 31వ తేదీ వరకు రోజుకు 25వేలు చొప్పున ప్రత్యేక ప్రవేశదర్శనం టోకెన్లను జారీ చేయనుంది. ఇప్పటికే సర్వదర్శనం టోకెన్ల సంఖ్యను 20వేలకు పెంచడంతో ప్రతి రోజూ శ్రీవారిని దర్శించుకునేవారి సంఖ్య 50-60వేలకు చేరుకునే అవకాశముంది. ఇక మార్చి కోటా ప్రత్యేక ప్రవేశదర్శనం కోటా టోకెన్లను కూడా ఈనెల 23నే విడుదల చేస్తామని టీటీడీ ప్రకటించింది. ప్రతి నెల 25వ తేదీ తర్వాత ఆన్ లైన్ దర్శన టోకెన్లను విడుదల చేస్తున్న టీటీడీ.. ఈసారి ముందుగానే జారీ చేస్తోంది. ఇదిలా ఉంటే ఈనెల 15వ తేదీ నుంచి ఆఫ్ లైన్లో శ్రీవారి సర్వదర్శన టికెట్లను జారీ చేస్తున్న సంగతి తెలిసిందే. రోజుకు 15వేల టోకెన్ల చొప్పున విడుదల చేస్తుండగా.. వాటి కోసం భారీగా క్యూలైన్లు ఉంటున్నాయి. టోకెన్ తీసుకున్న నాలుగు రోజుల తర్వాతగానీ శ్రీవారి దర్శన భాగ్యం కలగని పరిస్థితి నెలకొంది. టోకెన్లు పొందిన తేదీకి నాలుగు రోజుల తర్వాత దర్శనానికి అవకాశం కలుగుతుండటంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. దర్శనానికి 12 గంటల ముందుగానే కొండపైకి అనుమతించే అవకాశం లేకపోవడంతో భూదేవీ కాంప్లెక్స్ వద్దే పడిగాపులు కాస్తున్నారు. హోటళ్లలో ఉండే స్థోమత లేకపోవడంతో కొందరు ఆరుబయటే వంటలు చేసుకుంటూ అక్కడే నిద్రిస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)