అయ్యన్న పాత్రుడి కోసం పోలీసుల పడిగాపులు?

Telugu Lo Computer
0


తెలుగు దేశం పార్టీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయన ఇంటికి బుధవారం ఉదయం పోలీసులు చేరుకున్నారు. నోటీస్ ఇచ్చేందుకు నర్సీపట్నంలోని ఆయన ఇంటికి చేరుకున్న పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల పోలీసులకు.. అయ్యన్నపాత్రుడు ఇంట్లో లేరంటూ బంధువులు సమాధానం చెప్పారు. దీంతో ఆయన కోసం పోలీసులు పడిగాపులు కాస్తున్నారు. మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడికి నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన పోలీసులు ఆయన కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. బుధవారం ఉదయం నుంచి అక్కడే ఉన్నారు. ఎంతకీ ఆయన జాడ కనిపించకపోవడంతో అయ్యన్న ఇంటి గోడకు నోటీసులు అంటించినా పోలీసులు మాత్రం అక్కడి నుంచి వెళ్లకపోవడంతో అరెస్ట్‌ తప్పదేమోనన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో వందల మంది కార్యకర్తలు అయ్యన్న ఇంటి దగ్గరే ఉన్నారు. మరోవైపు మాజీ మంత్రి ఎక్కడ ఉన్నారనేది ఎవరూ చెప్పడం లేదు. ఆయన వచ్చే వరకు వేచిచూసే ధోరణి పోలీసుల వైపు నుంచి కనిపిస్తోంది. ఈ పరిణామాలతో నర్సీపట్నంలోని అయ్యన్న ఇంటి దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. ఇదిలావుంటే, ఈ నెల 18న పశ్చిమగోదావరి జిల్లా నల్లజర్లలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం జగన్‌పై అయ్యన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, ప్రజలను రెచ్చగొట్టి, విద్వేషాలు చేశారని నల్లజర్ల వైఎస్సార్‌సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు కండెపు రామకృష్ణ నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అయ్యన్నపై 153A, 505(2), 506 IPC సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ కేసులోనే విచారణకు రావాలని నోటీసులు జారీ చేశారు. నర్సీపట్నంలో వందల పోలీసులు మోహరించడంతో అయ్యన్న అరెస్ట్‌ తప్పదన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు విశాఖ జిల్లా నర్సీపట్నం చేరుకుని 41(A) నోటీసు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఆ సమయంలో అయ్యన్నపాత్రుడు ఇంటి వద్ద లేకపోవడంతో కొందరు పోలీసులు అక్కడే ఉండి అయ్యన్న కోసం అర్థరాత్రి వరకు ఎదురు చూశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)