అమ్మకానికి ఏఐజీ హాస్పిటల్స్‌?

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని ఏఐజీ (ఆసియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రోఎంటరాలజీ) హాస్పిటల్స్‌లో మెజారిటీ వాటాను ప్రమోటర్లు అమ్మకానికి పెట్టినట్లు సమాచారం. ఈ హాస్పిటల్స్‌ను ప్రమోట్‌ చేసిన నాగేశ్వర్‌ రెడ్డి, ప్రస్తుత షేర్‌హోల్డర్‌ అయిన క్వాడ్రియా క్యాపిటల్‌లు కలిసి ప్రధాన వాటాను విక్రయిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 1,100 పడకల సామర్థ్యంగల రెండు హాస్పిటల్స్‌ను కలిగిన ఏఐజీ హాస్పిటల్స్‌ విక్రయానికి అంతర్జాతీయ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంక్‌ గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ను నియమించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఏఐజీలో క్వాడ్రియా క్యాపిటల్‌కు 30 శాతం వాటా ఉండగా, ప్రమోటర్ల వద్ద మిగిలిన వాటా ఉంది. వారు ఇరువురూ కలిసి 60-70 శాతం మెజారిటీ వాటాను విక్రయించనున్నారు. ఈ డీల్‌ విలువ రూ. 4,500-5,000 కోట్లు ఉండవచ్చని అంచనా. ప్రమోటర్లు 30-40 శాతం వాటాను ఆఫ్‌లోడ్‌ చేస్తారని లావాదేవీని చూస్తున్నవారు వెల్లడించారు. ఈ అమ్మకానికి సంబంధించి వచ్చే 10 రోజుల్లో బిడ్స్‌ అందవచ్చని భావిస్తున్నారు. విక్రయ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న గోల్డ్‌మాన్‌ సాచ్స్‌ కొద్దిరోజులుగా పలు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ) ఫండ్స్‌ను సంప్రదిస్తున్నది. ఇప్పటికే కార్లే, టీపీజీ, బేరింగ్‌ పీఈ ఆసియాలతో సహా పెద్ద పీఈ ఫండ్స్‌తో సంప్రదింపులు జరిపిందని సమాచారం. 1986లో ఏర్పాటైన ఏఐజీ ఆసియాలోనే అతిపెద్ద గ్యాస్ట్రోఎంటరాలజీ హాస్పిటల్‌గా పేరొందింది. దీనికి ప్రస్తుతం గచ్చిబౌలిలో 800 పడకలు గల సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్, సోమాజీగూడలో 300 పడకలతో ఒక హాస్పిటల్ ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ సంస్థ రూ. 2,200 కోట్ల టర్నోవర్‌పై రూ. 300 కోట్ల ఆపరేటింగ్‌ లాభాన్ని ఆర్జించవచ్చని అంచనా.

Post a Comment

0Comments

Post a Comment (0)