చాపకింద నీరులా కుష్టు వ్యాధి ?

Telugu Lo Computer
0


అంతరించిపోయిన జాబితాలో ఉండాల్సిన కుష్టు వ్యాధి మళ్లీ విస్తరిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే వికారాబాద్‌ జిల్లాలో ఈ రోగులు అధికంగా ఉండటం ఆందోళనకరమని వైద్యులు పేర్కొంటున్నారు. దీని నిర్మూలనకు తగిన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని గమనించి ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. క్షయ వ్యాధి నిర్మూలనకు పనిచేసే సిబ్బంది సహాయం తీసుకుంటున్నారు. ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి రోగులను గుర్తించి వారికి మందులు పంపిణీ చేస్తున్నారు. బొంరాస్‌పేట, కుల్కచర్ల, అంగడి రాయిచూర్‌, యాలాల తదితర ప్రాంతాల్లో కుష్టు రోగులు అధికంగా ఉన్నట్లు వైద్యాధికారులు గమనించారు. యాలాల మండల కేంద్రంలో ఇటీవల నిర్వహించిన వైద్య శిబిరంలో ఇద్దరు రోగులను గుర్తించారు. ఆయా మండలాల్లో శిబిరాలను ఏర్పాటుచేస్తే ఇంకా ఎంతమంది ఉన్నారో తెలుస్తుందన్నారు. వివరాలను గోప్యంగా ఉంచుతామని వ్యాధి లక్షణాలున్నవారు ధైర్యంగా తమను సంప్రదించాలని కోరుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కుష్టును పెద్ద రోగం అని కూడా అంటారు. జిల్లాలో దీని నిర్మూలన కోసం ఓ అధికారి మాత్రమే ఉన్నారు. ఆయన తాండూరు, వికారాబాద్‌, కొడంగల్‌ ఆస్పత్రికి వారానికి ఒకసారి వచ్చి వెళుతుంటారు. మైక్రోబాక్టీరియా లెప్రే అనే బాక్టీరియా వల్ల కుష్టు సంక్రమిస్తుంది. ఇది చర్మ, నరాలకు సంబంధించిన వ్యాధి. దీనిని సులభంగా గుర్తించవచ్చు. జిల్లాలో వైద్యాధికారులు తెలిపిన లెక్కల ప్రకారం ప్రస్తుతం 80 మంది కుష్ఠు రోగులున్నారు. ఒక్క కుల్కచర్ల, బొంరాస్‌పేట ప్రాంతాల్లోనే 40 మంది కుష్టు రోగులున్నట్లు గుర్తించారు. ఇంతకన్నా మూడింతలు ఎక్కువే ఉండవచ్చని పరిశీలకుల అంచనా. దీంతో అన్ని మండలాల్లో శిబిరాలను ఏర్పాటు చేసి రోగులను గుర్తించాలని అధికారులు నిర్ణయించారు. అశ, ఏఎన్‌ఎంల ద్వారా సర్వే చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈనెల 16, 17 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించి కుష్టు వ్యాధి రోగులను గుర్తిస్తుంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందో వారు కచ్చితంగా అంచనా వేస్తారు. రోగులకు సేవలందించే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని సూపర్‌వైజర్లకు శిక్షణ ఇస్తారు. మండల కేంద్రాల్లో సమావేశాలను నిర్వహిస్తారు. కుష్టు నివారణకు అవసరమైన మందులు అన్ని పీహెచ్‌సీల్లో సిద్ధంగా ఉన్నాయి. రోగులకు నెలకు సరిపడా పంపిణీ చేస్తున్నామని వైద్య సిబ్బంది తెలిపారు. ఆరు నెలల నుంచి ఏడాది పాటు క్రమం తప్పకుండా వాడితే కుష్ఠు తగ్గిపోతుందన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)