తగ్గిన వంట నూనెల ధరలు!

Telugu Lo Computer
0


వంట నూనెల ధరలు గత నెల రోజులుగా తగ్గుతున్నట్టు వినియోగదారుల వ్యవహారాలు, ఆహార , పౌర సరఫరాల శాఖ తెలిపింది. ట్యాక్సులపై కేంద్ర ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాన్ని కంపెనీలు కస్టమర్లకు బదిలీ చేయాలని కేంద్ర ఆహార శాఖ సూచించింది. దాంతో కంపెనీలు 15 నుంచి 25 శాతం దాకా ధరలు తగ్గించాయి. అంతర్జాతీయ ధరలు ఎక్కువగా ఉండటంతో కొన్ని నెలలుగా వంట నూనెల ధరలు పెరిగాయని, అయితే రాబోయే రోజుల్లో ఇంకా తగ్గే అవకాశం ఉందని కంపెనీలు చెబుతున్నాయి. ప్రధాన వంట నూనెల బ్రాండుల కంపెనీలైన ఫార్చూన్ , రుచి గోల్డ్ , సన్ రిచ్, న్యూట్రెల్లా, ఫ్రీడమ్ సన్ ఫ్లవర్, ప్రియ బ్రాండ్స్ వంట నూనె ధరలు 20శాతం వరకూ తగ్గించాయి. ఈ ఏడాది మొదటి నుంచి సన్ ఫ్లవర్ నూనె ధర పెరుగుతూ లీటరు రేటు రూ.180కి చేరింది. మరో నాలుగు నెలల వరకూ ఆయిల్ ధరలు పెరిగే అవకాశం లేదని తెలంగాణ ఆయిల్ ఇండస్ట్రీ ట్రేడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సురేష్ కుమార్ అగర్వాల్ తెలిపారు. రిఫైన్డ్ పామాయిల్ పై కస్టమ్స్ ట్యాక్స్ 17.5 నుంచి 12.5 శాతానికి కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. ఈ తగ్గింపు 2022 మార్చి వరకు వర్తిస్తుంది. సన్ ఫ్లవర్, సోయాబీన్, పామాయిల్ దిగుమతులు కూడా పెరగడంతో రాబోయే 4 నెలలు నూనెల ధరలు నిలకడగా ఉంటాయంటున్నారు. తగ్గిన ధరలతో లీటర్ రూ.180 వరకు పలికిన రిఫైన్డ్ ఆయిల్ ప్రస్తుతం 130 రూపాయలు ఉండగా.. లీటర్ పామాయిల్ 110 రూపాయలు పలుకుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)